నాడు బెదిరింపే ఆయుధం.. నేడు పరిష్కారమే ప్రాధాన్యం 

11 Jun, 2022 04:30 IST|Sakshi

సాక్షి, అమలాపురం: కోనసీమ రైతుల సాగుసమ్మె ప్రకటన విషయంలో ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందనే దానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. అలాగే.. రైతు సమస్యల పరిష్కార విషయంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనే దానికీ ఈ రెండు ఘటనలు అద్దం పడతాయి.

అధికారంలో ఉండగా తాము రైతులపట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించాం, ఎంత అణచివేత ధోరణితో వ్యవహరించామో అనే విషయాన్ని మరిచి చినరాజప్ప, ఆనందరావులు తమ హయాంలో కోనసీమలో సాగుసమ్మె జరిగే పరిస్థితి రాలేదని, తమ పాలనలో రైతుల సమస్యలు పరిష్కరించామని నిస్సిగ్గుగా చెప్పడంతో చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ధాన్యం సొమ్ములు విడుదల చేసినప్పటికీ రైతులకు ధాన్యం సొమ్ముల బకాయిలు ఉన్నందునే రైతులు సాగుసమ్మె చేస్తున్నారని చెప్పడం చూసి సొంత పార్టీ నేతలే నిర్ఘాంతపోయారు. 

అప్పట్లో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు..

 • ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు 2012లో వచ్చిన నీలం తుపానుతో నష్టపోయిన రైతులకు నాటి ప్రభుత్వం విడుదల చేసిన పరిహారంలో సాంకేతిక కారణాలవల్ల కొంత మొత్తం అందలేదు. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 వేల మంది రైతులకు రూ.ఆరు కోట్లు రావాల్సి ఉన్నా ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
 • 2013లో వచ్చిన హెలెన్‌ తుపానువల్ల నష్టపోయిన సుమారు 1.50 లక్షల మంది రైతులకు బకాయిలున్న పరిహారం రూ.71 కోట్లూ ఇవ్వలేదు. పాత ప్రభుత్వం బకాయిలతో తమకు సంబంధంలేదని ఎగనామం పెట్టింది. దీనివల్ల ఇప్పటి కోనసీమ రైతులే ఎక్కువగా నష్టపోయారు.
   
 • ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాన్‌ పరిహారం రూ.162 కూడా మూడేళ్ల వరకు అంటే 2018–19 వరకు ఇవ్వలేదు. బాబు అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు నయా పైసా విడుదల చేసిన పాపానపోలేదు.
   
 • కూనవరం, వాసాలతిప్ప డ్రెయిన్‌ ఆధునీకరణ పేరుతో ఒకసారి, మొగల వద్ద డ్రెడ్జింగ్‌ పేరుతో మరోసారి రూ.20 కోట్ల నిధులు కేటాయించుకునేలా చేసి అడ్డగోలుగా నిధులను మింగేశారు. పనులు మాత్రం అధ్వానంగా పూర్తిచేశారు. పైగా వీరు చేసిన పనులువల్ల సముద్రపు నీరు ఎగదన్నడంతో పంట పొలాలను ఉప్పునీరు ముంచెత్తింది. 

ఆ ఐదేళ్లూ రైతులు ఖరీఫ్‌కు దూరం
మరోవైపు.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కోనసీమలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగుచేయడం మానేశారు. ఇప్పుడు సాగుసమ్మె రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న రాజప్ప, ఆనందరావుల సొంత మండలం ఉప్పలగుప్తంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా పంట విరామం పాటించారు. అయితే, వీరిద్దరూ తమ హయాంలో సాగుసమ్మె చేయాల్సిన అవసరంలేకుండా చేశామని గొప్పలకు పోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. 

నాడు..
అది 2018.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయం.. కోనసీమలో రైతులు సాగుసమ్మె ఉద్యమానికి సిద్ధమయ్యారు. అమలాపురం మండలం ఈదరపల్లి జనహిత భవనంలో రైతులు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. సెక్షన్‌–30 ఉందని, సమావేశాలకు అనుమతిలేదన్నారు. రైతులు మాట్లాడుతున్న మైకు తీసుకుని నేలకేసి కొట్టారు. కుర్చీలు తన్నేశారు. 

ఆ తర్వాత రైతులను ఆర్డీఓ కార్యాలయంలో చర్చలకు రమ్మని పిలిచారు. అప్పటి హోంమంత్రి చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు ‘సమస్యలు పరిష్కరిస్తాం.. సాగుచేయండి. అంతేకాని సాగుసమ్మె అన్నారా? చూస్తూ ఊరుకునేదిలేదు’ అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. పోలీసు కేసులంటూ హెచ్చరించారు.

ఇక కోనసీమ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రస్తుత ఏపీ స్టేట్‌ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామిల మీద పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ, రైతు సమస్యల పరిష్కారానికి మాత్రం బాబు సర్కారు చొరవ చూపలేదు. 

సీన్‌ కట్‌చేస్తే నేడు..
కోనసీమలో సాగుసమ్మె చేస్తామని టీడీపీ అనుకూల రైతు సంఘాల నాయకులు ఇటీవల ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. అమలాపురంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కోనసీమలో సెక్షన్‌–30, 144 సెక్షన్‌ అమలులో ఉంది. దీనిని బూచిగా చూపి ప్రభుత్వం బెదిరింపులకు దిగలేదు. రైతులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఆగమేఘాల మీద కదిలింది. ధాన్యం సొమ్ములు అందలేదన్న రైతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 48 గంటల్లో చెల్లిస్తామని చెప్పింది.

12 గంటలు దాటకుండానే వారి ఖాతాల్లో జమచేసింది. 21 రోజులు దాటిన తరువాత ఇవ్వాల్సిన సొమ్ములు కూడా ముందుగానే చెల్లించింది. మురుగు, పంట కాలువల్లో పూడిక తొలగింపునకు తాత్కాలిక పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రైతుకు విత్తనం నుంచి ధాన్యం కొనేవరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, సాగుచేయాలని రైతులకు ధైర్యాన్నిస్తోంది.

అప్పట్లో కేసులు పెడతామన్నారు
టీడీపీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మాకు ముంపే సమస్య. కూనవరం మొగ పూడుకుపోవడంవల్ల చేలు ముంపులో ఉండేవి. అప్పుడు సాగుసమ్మె అంటే కేసులు పెడతామన్నారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్లొచ్చి సాగుసమ్మె చేయమంటే ఎలా చేస్తాం? ఇప్పుడు మా సమస్యలు చెబితే ప్రభుత్వం స్పందించింది. అప్పుడు కనీసం పిలిచి అడిగినవాడు లేడు. మేమైతే సాగు చేస్తాం. 
– మామిడిపల్లి కృష్ణ, చెయ్యేరు, కాట్రేనికోన మండలం, కోనసీమ జిల్లా

ఇప్పుడు అడిగినవన్నీ ఇచ్చారు
ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా వేసింది.. ధాన్యం డబ్బులిచ్చారు. ప్రభుత్వం మేం అడిగినవన్నీ ఇచ్చింది. మావోళ్లు అడిగారనే ముందుగా నీరిచ్చారు. ముంపు సమస్య తీరుస్తామంటున్నారు. సాగుచేయకుండా ఎలా ఉంటాం? సొంతంగా రెండెరాలుంది. మరో నాలుగు కౌలుకు చేస్తున్నాం. మా ఊళ్లో ఆలస్యంగా ఊడ్పులు చేస్తాం. ఈసారి కొద్దిరోజులు ముందుగానే ఊడ్చాలనుకుంటున్నాం. 
– సలాది రాముడు, రైతు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం, కోనసీమ జిల్లా

ఈ మూడేళ్లలో ఇలా..
టీడీపీ పాలనలో అన్నదాతల వేదన అరణ్యరోదనగా మారితే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల పాలనలో రైతులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. కలలో కూడా ఊహించని మార్పులు గ్రామసీమల్లో సాకారమవుతున్నాయి. 

 • 18లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచిత విద్యుత్‌ నుంచి ఆర్బీకేల దాకా అన్నదాతలకు సంపూర్ణ సహకారం అందుతోంది. రైతన్నలకు ఏది కావాలన్నా గ్రామాల్లోనే లభ్యమవుతున్నాయి. 
   
 • 1,38,39,396 మంది రైతులు ఆర్బీకేల సేవలను వినియోగించుకున్నారంటే అవి ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో ఊహించవచ్చు. 
   
 • గతంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తెచ్చుకునేందుకు ఒక్కో రైతుకు రూ.500 నుంచి రూ.1,000 చొప్పున ఖర్చయ్యేది. ఇప్పుడా కష్టాలన్నింటికీ ప్రభుత్వం చరమగీతం పాడింది. దీంతో రైతుకు ఏది కావాలన్నా ఆర్బీకేకి వెళ్లి చిటికెలో నాణ్యమైనవి తెచ్చుకుంటున్నారు. పైగా ఇక్కడ మార్కెట్‌ రేటు కంటే 10 శాతం తక్కువకే దొరుకుతున్నాయి.
   
 • ఆర్బీకేలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ.16 వేల కోట్ల అంచనాతో గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక వసతులతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు, 10,250 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. 
   
 • పొలంబడులతో పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడులు పెరిగాయి. 8 పండిన ధాన్యమంతా ఆర్బీకేల ద్వారా విక్రయించుకుంటున్నారు. 
   
 • రైతుభరోసా, పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి గ్రామానికీ లబ్ధి చేకూరుతోంది. 
 • ఇక పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తుŠాన్నరు. నాణ్యమైన, ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. 
   
 • ఆక్వాకు కేరాఫ్‌గా నిలిచే కైకలూరు నియోజకవర్గంలో 72 ఆర్బీకేలు ఆక్వా సాగుచేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ అందజేస్తున్నాయి. 15 రోజులకోసారి రైతు క్షేత్రాల్లో నిర్వహిస్తున్న మత్స్య సాగుబడుల వల్ల దిగుబడులతో పాటు నాణ్యత పెరిగింది. రొయ్యలు, చేపల సైజు పెరిగింది. ఫలితంగా మంచి రేటు వస్తోంది.
   
 • 30 ఏళ్ల పాటు వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని కొనసాగించేలా సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. 
మరిన్ని వార్తలు