సిఫారసులకు చెల్లుచీటీ!.. టికెట్‌ ఉంటేనే దుర్గమ్మ దర్శనం 

18 Oct, 2023 08:18 IST|Sakshi

గంటన్నరలోపే పూర్తి 

అధికారుల చర్యలకు సత్ఫలితాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):  దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనంలో అధికారులు భారీ మార్పులు చేశారు. సిఫారసులు ఉన్నవారికే దుర్గమ్మ దర్శనం అనే భావన తొలగించి, ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా కేవలం గంటన్నర వ్యవధి లోపే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయశాఖ మంత్రితోపాటు అధికారులు, చైర్మన్‌ చెబుతూనే ఉన్నారు.

ఏటా ఇలానే చెబుతారు కదా అని సాధారణ భక్తులు భావించినా, ఈసారి దాన్ని చేతల్లో అమలు చేసి చూపించారు. టికెట్‌ ఉంటేనే దర్శనం అనే రీతిలో ఏర్పాట్లు జరిగాయి. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి దర్శనం పూర్తయి కొండ దిగేవరకూ కేవలం గంటన్నర వ్యవధిలోపే దర్శన సమయం పడుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను మంగళవారం విజయవాడ సీపీ టీకే రాణా తనిఖీ చేశారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులతో  మాట్లాడారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ప్రొటోకాల్‌ వాహనాలపైనే కొండకు...
పాలకమండలి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా దేవస్థానానికి చెందిన ప్రొటోకాల్‌ వాహనాలపైనే కొండపైకి చేరుకోవాలి. టికెట్‌ ఉంటేనే వాహనాల్లోకి ప్రవేశం అని ప్రకటించారు. వారితో వచ్చిన ఎవరైనా టికెట్‌ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నారు.  దీంతో తప్పని పరిస్థితుల్లోనైనా, వీఐపీలైనా టికెట్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇక టికెట్‌ కొనుగోలు చేసిన సామాన్య భక్తులు ఎవరైనా నేరుగా ఆలయానికి చేరుకునే వీలులేకుండా పక్కా ప్రణాళికతో కట్టడి చేశారు. ఘాట్‌ రోడ్డులోని ఓం టర్నింగ్‌ నుంచి అమ్మవారి ఆలయం చేరుకునే లోపు ఐదు చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు.

వాటికి ఎంఆర్‌వోలు, ఇతర రెవెన్యూ ముఖ్య అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సీఎం గేట్, ఆలయ సిబ్బంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఉన్న గేట్లకు సైతం తాళాలు వేశారు. ఎవరైనా సరే క్యూలైన్‌లోనే దర్శనానికి వెళ్లాలని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్నారు. అలానే సిఫారసులు ఉన్నా, నేరుగా దర్శనానికి కాకుండా, క్యూలైన్‌లోనే అనుమతిస్తుండటంతో ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా కనబడుతోంది. మరోవైపు డీసీపీ విశాల్‌గున్నీ ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ భక్తులు ఎవ్వరూ అనధికార మార్గాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసు అధికారులు సిఫారసు చేసిన వారిని సైతం పోలీసులు నేరుగా దర్శనానికి కాకుండా రూ.500 టికెట్‌ క్యూలైన్‌లోనే పంపుతున్నారు.
చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు  

మరిన్ని వార్తలు