మన్యంలో విజృంభిస్తున్న చలి

30 Jan, 2022 03:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చింతపల్లిలో 5.5 డిగ్రీలు 

పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్‌చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.

పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్‌ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు.    

మరిన్ని వార్తలు