విశాఖ ఏజెన్సీలో చలి పులి

3 Dec, 2021 04:35 IST|Sakshi
పాడేరులో ఉదయం 9 గంటలకు దట్టంగా కురుస్తున్న పొగమంచు

చింతపల్లిలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత 

ఉదయం 9 వరకు వీడని మంచు తెర 

శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు 

పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పాటు అర్ధరాత్రి నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత.

పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో కూడా 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు అధికమవుతున్నాయి. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులంతా ఏజెన్సీలోని శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.   

మరిన్ని వార్తలు