మన్యం గజగజ 

17 Nov, 2022 03:35 IST|Sakshi

కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదు 

చలిగాలుల విజృంభణతో ప్రజల అవస్థలు  

సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు): ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలిపులితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది.

ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోయారు. ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనంపై వాతావరణ శాఖ ప్రచారం చేసినా మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. బుధవారం ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురిసింది. సూర్యోదయం ఆలస్యమైంది.

మన్యంలో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు, చలితీవ్రతతో వణుకుతున్నారు. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మోతుగూడెం, చింతూరు ప్రాంతాల్లో కూడా చలితీవ్రత నెలకొంది. ఘాట్‌ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రతతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే చలిగాలులు విజృంభించినప్పటికీ పర్యాటకుల తాకిడి మన్యానికి ఏమాత్రం తగ్గలేదు. పొగమంచు ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8.2  డిగ్రీలు
మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 9.0  డిగ్రీలు
అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 9.7  డిగ్రీలు 

మరిన్ని వార్తలు