మిర్చి.. కలిసొచ్చి

22 Apr, 2021 04:39 IST|Sakshi

ఈ ఏడాది భారీ దిగుబడులకు తోడు మంచి ధర

విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు

రూ.8,250 కోట్ల టర్నోవర్‌

సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు కాసుల పంట పండుతోంది. సకాలంలో వర్షాలు కురవడం, కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో మిర్చి పంటకు ఈ ఏడాది భారీగా దిగుబడి వచ్చింది. ఈ ఏడాది విదేశాలకు పెద్ద ఎత్తున మిర్చి ఆర్డర్లు ఉండటంతో, దిగుబడులు భారీగా వచ్చినా ధరలు తగ్గకుండా, నిలకడగా ఉంటున్నాయి. క్వింటా మిర్చి ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. ప్రధానంగా ఈ ఏడాది (2020–21) 55 లక్షల టన్నులు (1.37 లక్షల టిక్కీలు)కు పైగా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుందని అధికారుల అంచనా. మిర్చి ఎగుమతులకు సంబంధించి దాదాపు రూ.8,250 కోట్ల టర్నోవర్‌ ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 3.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట సాగు అయ్యింది. ఇందులో ఎక్కువ భాగం గుంటూరు జిల్లాలో 1.92 లక్షల ఎకరాల్లో, తరువాత ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప, కృష్ణా జిల్లాల్లో సాగు అవుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మిర్చి గుంటూరు యార్డుకు తరలిస్తారు.

ప్రధానంగా మిర్చి ఎగుమతి అయ్యే దేశాలు...
మిర్చిని ఎక్కువగా చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. దీనితో పాటు చిలీ, వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక, యూఎస్‌ఏ, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్‌ ఆఫ్రికా, మెక్సికో దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. దీంతో పాటు దేశంలో తమిళనాడు, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గుంటూరు మార్కెట్‌ యార్డు నుంచి మిర్చి వెళుతుంది.

ధరలు బాగున్నాయి
నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. ఈ ఏడాది కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో ఎకరాకు మిర్చి దిగుబడి 30 క్వింటాళ్లకు పైనే వచ్చింది. దీనికితోడు మిర్చి ధరలు క్వింటా రూ.14 వేలకు పైనే ఉన్నాయి. దీంతో పెట్టుబడులు, కోత కూలీల ఖర్చులు పోయినా మాకు ఎకరాకు రూ.1.5 లక్షలు మిగిలింది.     
– కృష్ణారెడ్డి, మిర్చి రైతు,వినుకొండ, గుంటూరు జిల్లా

విదేశాల నుంచి ఆర్డర్లు బాగా ఉన్నాయి
ఈ ఏడాది విదేశాల నుంచి మిర్చి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. చైనా,  బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో మార్కెట్‌కు డిమాండ్‌ బాగా ఉంది. దీంతో ఈ ఏడాది మిర్చి దిగుబడులు అధికంగా వచ్చినా మంచి ధర పలుకుతోంది. మార్కెట్‌లో ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు.
– కొత్తూరు సుధాకర్, మిర్చి ఎగుమతి వ్యాపారి

ధరలు నిలకడగా ఉన్నాయి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది  మిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. సాధారణ రకం మిర్చి ధర సైతం గతేడాది క్వింటాల్‌ రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికింది. ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినా క్వింటాల్‌ ధర రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. హైబ్రిడ్‌ రకాల ధర క్వింటాల్‌ దాదాపు రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. యార్డులో రైతులకు మిర్చి క్రయ విక్రయాలు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి సెక్రటరీ, గుంటూరు మిర్చి యార్డు 

మరిన్ని వార్తలు