రైళ్లకు సమ్మర్‌ రష్‌..!

24 Apr, 2022 04:26 IST|Sakshi

నెలన్నర వరకు బెర్త్‌లు ఫుల్‌

వెయిట్‌ లిస్టు చూపిస్తున్న రైల్వే వెబ్‌సైట్‌

విజయవాడ–విశాఖ మధ్య అధిక డిమాండ్‌.. రద్దీ నియంత్రణకు వేసవి ప్రత్యేక రైళ్లు 

సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్‌లు ఫుల్‌ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు.

విజయవాడ జంక్షన్‌ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్‌ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్‌ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్‌ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్‌ క్లాస్‌కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్‌ ఏసీకి డిమాండ్‌ అధికంగా ఉంది. 

విజయవాడ–విశాఖ రూట్‌కు డిమాండ్‌
విజయవాడ–హైదరాబాద్‌ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్‌ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్‌ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు  బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్‌ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్‌ స్లీపర్‌ వెయిట్‌ లిస్ట్‌ 17 కాగా థర్డ్‌ ఏసీ వెయిట్‌ లిస్ట్‌ 18 ఉంది. గోదావరి స్లీపర్‌ వెయిట్‌ లిస్ట్‌ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి.

వేసవికి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని  నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు.

పరీక్షల అనంతరం.. 
ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్‌ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్‌ సిటీ, పాసింజర్‌ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్‌ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు