వైభవంగా కోదండరాముడి రథోత్సవం

17 Apr, 2022 03:36 IST|Sakshi
అశేష భక్తజనుల మధ్య ముందుకు సాగుతున్న రథం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీగా హాజరైన భక్తజనం

ఒంటిమిట్ట: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం నిర్వహించారు.  దీనికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కాయకర్పూర నీరాజనాలు అందించారు. 

బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్ధని అలంకారంలో రాములవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామి వారు విహరిస్తారు.  

మరిన్ని వార్తలు