Fertility Rate: ఇక్కడ తగ్గుతున్నారు.. అక్కడ పెరుగుతున్నారు

21 Jul, 2021 18:43 IST|Sakshi

దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటు

భారత్‌లో సగటు జననాల సంఖ్య 2.2

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 1.6 మాత్రమే

బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలో భారీగా సంతానం

దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వృద్ధులు పెరిగే అవకాశం

సాక్షి, అమరావతి: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జననాల సంఖ్య (బర్త్‌ రేట్‌) అమాంతం పెరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా తగ్గిపోతోంది. దేశంలో జనాభా పెరుగుదల మధ్య తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య సూచిక (టోటల్‌ ఫెర్టిలిటీ రేటు) తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతాన సాఫల్యత గల మహిళ ఆంధ్రప్రదేశ్‌లో 1.6 మందిని మాత్రమే కంటున్నారు. ఫెర్టిలిటీ రేటు తగ్గడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేది.

తాజా గణాంకాల ప్రకారం అది 1.6 కు మాత్రమే పరిమితమైంది. కనీసం 1.9 లేదా ఆ పైన జననాల సంఖ్య ఉంటేనే జనాభా పెరుగుదల ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ ఫెర్టిలిటీ రేటు 1.7 కంటే తక్కువగా ఉంది. దీనివల్ల జనాభా పెరుగుదల కనీస స్థాయిలో కూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. దేశంలోనే అత్యంత తక్కువగా జననాల రేట 1.5 మాత్రమే ఉంది. 

ఉత్తరాదిన పెరుగుతున్న జనాభా 
ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం సగటుకు మించి జనాభా పెరుగుతున్నారు. అత్యధికంగా బిహార్‌లో సగటున ఒక మహిళ 3.2 మందికి జన్మనిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచి్చన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా సగటు బర్త్‌ రేటు 2.2గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే బిహార్‌లో నూరు శాతం ఎక్కువగా ఫెర్టిలిటీ రేటు నమోదవటం గమనార్హం. 

ఇద్దరంటే మొగ్గు చూపడం లేదు 
గతంలో ‘ఇద్దరు పిల్లలు.. ఇంటికి వెలుగు’ అనే నినాదాలు హోరెత్తేవి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఒక్కరే చాలు అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు. చాలామంది యువతులు ఉద్యోగాలు, ఉపాధి వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో వారు ఇద్దరు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. మగవాళ్లు సైతం అదే భావంతో ఉంటున్నారు. పట్టణీకరణ నేపథ్యంలో కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం, చదువుల వ్యయం కారణంగా ఆయా కుటుంబాలు పిల్లలకు జన్మనిచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పిల్లల పెంపకం భారంగా మారడం కూడా సంతాన సాఫల్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో సంతానోత్పత్తి తగ్గిపోతున్నట్టు చెబుతున్నారు. ఇలా తగ్గుతూ వెళితే.. జనాభా ప్రాతిపదికన ఏర్పాటయ్యే పార్లమెంటరీ స్థానాలను పునరి్వభజన చేస్తే ఒక ప్రాంతంలో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని, మరో ప్రాంతంలో తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు