'ఆర్బీకేల్లో' దండిగా ఎరువులు

3 Nov, 2021 04:04 IST|Sakshi

రబీలో కొరత లేకుండా సర్కార్‌ కట్టుదిట్టమైన చర్యలు

సీజన్‌కు 23.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం

ఇప్పటివరకు విక్రయించినవి 3.37 లక్షల టన్నులు

ఇంకా అందుబాటులో 5.64 లక్షల టన్నుల ఎరువులు

ఆర్బీకేల్లో 1.95 లక్షల టన్నుల నిల్వలుంచేలా ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రబీ–2021–22 సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. సీజన్‌లో 23.44 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. దీంతో ఆ మేరకు కేటాయింపులు జరిపేందుకు కేంద్రం కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏ దశలోనూ ఎరువుల కోసం ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రబీ పంటల సాగు కోసం అక్టోబర్‌లో 4.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం. ప్రారంభ నిల్వలు 6.51 లక్షల టన్నులుండగా.. అక్టోబర్‌ 26 నాటికి కేంద్రం 2.50 లక్షల టన్నుల మేర సరఫరా చేసింది. దీంతో ఎరువుల నిల్వలు 9.01 లక్షల టన్నులకు చేరుకున్నాయి. వీటిలో ఇప్పటివరకు 3.37 లక్షల టన్నుల ఎరువులను విక్రయించారు. ప్రస్తుతం 5.64 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

ఆర్బీకేల ద్వారా అవగాహన
రబీ సీజన్‌ కోసం ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల టన్నులు ఎరువులు సరఫరా చేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 88 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ ఉంచగా.. అక్టోబర్‌ 26 నాటికి 25 వేల టన్నుల ఎరువులను రైతులకు విక్రయించారు. మిగిలిన ఎరువులను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్‌ మేరకు డీఏపీ, ఎంవోపీ ఎరువులను ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నివేళలా అన్ని పంటలకు డీఏపీ, ఎంవోపీ ఎరువులపైనే ఆధారపడకుండా సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

కాంప్లెక్స్‌ ఎరువులే మేలు
రబీలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డీఏపీ, ఎంవోపీలపైనే పూర్తిగా ఆధార పడకుండా కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. డీఏపీలో నత్రజని, భాస్వరం, ఎంవోపీలో పొటాష్‌ మాత్రమే లభిస్తాయి. అదే కాంప్లెక్స్‌ ఎరువుల్లో నత్రజని, భాస్వరంతోపాటు పొటాష్, గంథకం వంటి ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం వల్ల పంట ఎదుగుదల, దిగుబడిలో ఏ మాత్రం తేడా రాదు. ఎరుపు రంగు పొటాష్‌కు బదులు మార్కెట్‌లో తెలుపు రంగు పొటాష్‌ లభిస్తోంది. ఎరుపు రంగులో లభ్యమయ్యే 60 శాతం పొటాష్‌ తెలుపు రంగులోనూ ఉంటుంది. ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్న వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్‌ వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు