లై‘సెన్సు’ తప్పనిసరి.. చాలామంది ఎల్‌ఎల్‌ఆర్‌ వద్దే ఆగిపోతున్నారు

17 Jul, 2021 09:22 IST|Sakshi
లైసెన్స్‌ లేకుండా ట్రిబుల్‌ రైడింగ్‌ వెళ్తున్న వారిని తనిఖీ చేస్తున్న పోలీసులు

సాక్షి,కర్నూలు: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో వాహనం ఒక భాగం అయిపోయింది. పని ఎటువంటిదైనా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే వారి ఆర్థిక స్థోమత బట్టి ఏదో ఒక వాహనం చేతిలో ఉండాల్సిందే. కరోనా మహమ్మారి అధిక శాతం మంది జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంతో జనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజా రవాణాలైన ఆటోలు, బస్సులు ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. ఎవరికి వారు ఉన్నంతలో సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగిఉండాలి. శాశ్వత లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం.  

ముందుగా ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకోవాలి  
ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌(ఎల్‌ఎల్‌ఆర్‌) తీసుకోవాలి. తరువాత రవాణా శాఖ కార్యాలయంలో శాశ్వత లైసెన్స్‌ ఇస్తారు. ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం ముందుగా కామన్‌ సర్వీసు కేంద్రాలు, వార్డు, సచివాలయాల్లో స్లాట్‌ బుక్‌ చేస్తారు. కుదిరిన తేదికి స్లాట్‌ బుక్‌ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి లెర్నింగ్‌ లైసెన్స్‌ ఇస్తారు. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత లైసెన్స్‌ పొందేందుకు అనుమతి వస్తుంది. కానీ అధిక శాతం మంది ఎల్‌ఎల్‌ఆర్‌తోనే సరిపెట్టుకుంటున్నారు.

ప్రతి ఏడాది ఎల్‌ఎల్‌ఆర్‌ పొందినవారిలో కనీసం 10 వేల మందికి పైగా శాశ్వత లైసెన్స్‌ తీసుకోవడం లేదు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపి రవాణా శాఖ అధికారులు, పోలీసులకు పట్టుబడితే వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జరిమానాలు పెరిగాయి. కావున ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకున్న వారు కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. కరోనాకు ముందు జిల్లాలో ప్రతి రోజూ ఎల్‌ఎల్‌ఆర్‌లు 250, శాశ్విత లైసెన్స్‌లు 250, స్లాట్‌ బుక్కింగ్‌కు అనుమతించే వారు. కర్ఫ్యూ నిబంధనలు సడలించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల విరామం తరువాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. 

చలానాలు... 
ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం ద్విచక్ర వాహన చోదకులు రూ. 260, ద్విచక్ర వాహనంతో పాటు కారు లైసెన్స్‌ కావాలనుకునే వారు రూ.420 చలానా చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్‌ పాసైన తర్వాత శాశ్వత లైసెన్స్‌ కోసం కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ద్విచక్ర వాహనం కోసమైతే రూ.960, ద్విచక్ర వాహనంతోపాటు కారు అయితే రూ.1260 చలానా చెల్లించాలి.

పట్టుబడితే భారీగా అపరాధ రుసుం 
లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే భారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 1.30 లక్షల రవాణ వాహనాలున్నాయి. వీటి పర్యవేక్షణకు కర్నూలులో ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలున్నాయి. అక్కడ ఎల్‌ఎల్‌ఆర్, శాశ్విత లైసెన్స్‌లు పొందవచ్చు.  
 – రాజ్‌గోపాల్, ఎంవీఐ   

మరిన్ని వార్తలు