మృత్యు కీలలు

10 Aug, 2020 04:37 IST|Sakshi
మంటలను అదుపులోకి తీసుకొచ్చి బాధితులను తరలిస్తున్న రెస్క్యూ బృందం, ప్రమాదస్థలి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు

ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

10 మంది దుర్మరణం.. 18 మందికి గాయాలు

విజయవాడలోని హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో దుర్ఘటన

రమేశ్‌ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌

ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో మొత్తం 43 మంది

రిసెప్షన్‌ వద్ద ఉన్న పాత కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి మంటలు

బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

ఆదివారం ఉదయం 4.45 గంటలు.. విజయవాడలో ఘోరం.. నగరంలోని స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్‌ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మరికొద్దిసేపట్లో తెల్లవారుతుందనగా ఒక్కసారిగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. జీవితాలను చీకటిమయం చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అక్కడివారందరినీ పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్కసారిగా హోటల్‌ అంతా హాహాకారాలు.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఎవరికి వారు ఉరుకులు.. పరుగులు. ఈ ప్రయత్నంలో కొందరు హోటల్‌ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఆహుతయ్యారు. ఇలా మొత్తం 10 మంది బలయ్యారు. అగ్నిమాపక శాఖ క్షణాల్లో రంగంలోకి దిగి  మంటలను అదుపులోకి తీసుకువచ్చి భారీ నష్టాన్ని నిలువరించింది. సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి మృతులకు రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా ఈ సంఘటనపై సీఎంను ఆరా తీశారు.

సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలవగా, మరో 18 మంది గాయపడ్డారు. నగరంలోని రమేష్‌ ఆస్పత్రి.. ఏలూరు రోడ్డులో ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 31 మంది కోవిడ్‌ బాధితులు. వీరు కాకుండా ఆరుగురు చొప్పున మొత్తం 12 మంది హోటల్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

రిసెప్షన్‌లో ఉన్న పాత విద్యుత్‌ కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తేవడంతో పెనుముప్పు తప్పింది. పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సత్వరమే స్పందించి బాధితులను రక్షించి గాయపడ్డవారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, ఆళ్ల నాని, పేర్ని నాని, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్‌ ఇంతియాజ్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలిని సందర్శించి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతిచెందినవారికి సర్కార్‌ రూ.50 లక్షల చొప్పున భారీ పరిహారం ప్రకటించింది. ప్రధాని మోదీ.. సీఎం వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ సెంట్రల్‌ కార్యాలయ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం, హోటల్‌ యాజమాన్యంపై 304(2), 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
ఘటనా స్థలం నుంచి బాధితురాలిని తరలిస్తున్న సహాయక సిబ్బంది 

ప్రమాదం జరిగిందిలా..
► హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ మొత్తం ఐదంతస్తుల్లో ఉంది. నాలుగు అంతస్తుల్లో రూములు ఉండగా, ఐదో అంతస్తులో మీటింగ్‌ హాల్‌ ఉంది. లాక్‌డౌన్‌తో మార్చి 24 నుంచి జూలై 17 వరకు హోటల్‌ మూతపడి ఉంది. జూలై 18 నుంచి రమేష్‌ ఆస్పత్రి ఈ హోటల్‌లో ప్రైవేటు కోవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హోటల్‌లో మొత్తం 45 గదులు ఉండగా ఇందులో 30 గదుల్లో ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. 
► హోటల్‌ రిసెప్షన్‌ పక్కనే భవనానికి సంబంధించిన మొత్తం విద్యుత్‌ పరికరాలకు చెందిన కరెంట్‌ బోర్డ్‌ ఉంది. 
► తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు పాత విద్యుత్‌ కేబుళ్ల నుంచి పొగలు వ్యాపించి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రిసెప్షన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో రిసెప్షన్‌ కాలిపోయింది. రోజూ హోటల్‌ను శానిటైజ్‌ చేస్తుండటంతో మంటలు సులువుగా పై అంతస్తులకు వ్యాపించాయి. 
► గ్రౌండ్‌ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు దట్టంగా మంటలు వ్యాపించాయి. రెండు, మూడో అంతస్తుల్లోకి పొగ చేరింది. 

గాయపడ్డవారు వివిధ ఆస్పత్రులకు తరలింపు
► ఘటనలో పది మంది మృతి చెందగా, మిగిలిన రోగులు సురక్షితంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
► గాయపడ్డవారిలో ఐదుగురిని రమేష్‌ ఆస్పత్రికి, మరో ఐదుగురిని ఎమ్‌5 హోటల్‌లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు, ఇద్దరిని స్వర్ణ హైట్స్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు, ఒకరిని వైబ్రెంట్‌ హోటల్‌కి, ఇద్దరిని మెట్రోపాలిటన్‌కు, ఒకరిని హెల్ప్‌ ఆస్పత్రికి తరలించారు. 
► మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. 
► రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి శరీరం కాలిన గాయాలైనట్లు చెబుతున్నారు. అయితే వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.

ప్రమాద స్థలిలోనే మృతులకు కరోనా పరీక్షలు..
► విజయవాడ అగ్నిప్రమాద మృతులకు యాంటీజెన్‌ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. 
► 10 మందిలో ఎనిమిది మందికి కరోనా నెగిటివ్‌ రాగా.. ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
► పాజిటివ్‌గా తేలిన రెండు మృతదేహాలను ప్రత్యేక జాగ్రత్తలతో అధికారులు తరలించారు. 

జేసీ శివశంకర్‌ నేతృత్వంలో విచారణ కమిటీ
► ప్రమాద ఘటనపై విచారణకు జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
► కమిటీలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.గీతాబాయ్, ఆర్‌ఎఫ్‌వో టి.ఉదయకుమార్, సీపీడీసీఎల్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. 
► ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతోపాటు భద్రతా నిబంధనలు, ఆస్పత్రి నిర్వహణలో లోపాలు, వసూలు చేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 
► కాగా, ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు ఆదివారం సాయంత్రం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నుంచి ఒక బృందం వచ్చి ఆధారాలు సేకరించింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

బాధితుల హాహాకారాలు..
► అగ్నిప్రమాదాన్ని గుర్తించిన కరోనా రోగులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
► మరికొందరు పొగ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ రక్షించాలని కిటికీల్లోంచి కేకలు వేశారు. 
► ప్రాణభయంతో ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు హోటల్‌ పక్కన ఉన్న సందులోకి దూకి ప్రాణాలతో బయట పడ్డారు. మూడో అంతస్తు నుంచి ఇద్దరు రోగులు వెనుక వైపునకు దూకడంతో మృత్యువాత పడ్డారు. 
► ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరకపోవడంతో కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో కిందికి తీసుకొచ్చారు.  

మరిన్ని వార్తలు