కృష్ణాలో కొనసాగుతున్న వరద 'ఉధృతి'

20 Oct, 2020 04:26 IST|Sakshi
శ్రీశైలం డ్యాం 10 గేట్ల ద్వారా సాగర్‌కు నీటి విడుదల

ప్రకాశం బ్యారేజీ నుంచి 4.87 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 1,006.196 టీఎంసీలు సముద్రంలోకి

రెండు దశాబ్దాల్లో కృష్ణా జలాలు గరిష్ఠంగా కడలిలో కలవడం ఇదే

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు..  

నేడు శ్రీశైలానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం

గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ నిండటం రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి ఉధృతి

సాక్షి,అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల): కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 4,90,980 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా కృష్ణా డెల్టా కాలువలకు 3,472 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 4,87,508 క్యూసెక్కులను 70 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదులుతున్నారు. ఈ సీజన్‌లో అంటే జూన్‌ 1 నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 1,006.196 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. రెండు దశాబ్దాల్లో ఒక సీజన్‌లో ప్రకాశం బ్యారేజీ నుంచి గరిష్ఠంగా కృష్ణా జలాలు సముద్రంలో కలవడం ఇదే తొలిసారి.

► ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల నుంచి విడుదల చేసిన జలాలకు నల్లమలలో కురిసిన వర్షాలు తోడై శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,41,069 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం జలాశయం పదిగేట్లను ఎత్తి, కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 4,98,890 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 4,62,586 క్యూసెక్కులను, పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 4,32,920 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

నేడు వరద తగ్గే అవకాశం
► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ఆల్మట్టి డ్యామ్‌లోకి వచ్చే వరద 52 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆల్మట్టి నుంచి దిగువకు 37 వేల క్యూసెక్కులు వదులుతుండగా, నారాయణపూర్‌ నుంచి ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 51,800, తుంగభద్ర నుంచి 13,985 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి శ్రీశైలంలోకి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గనుంది. దిగువ కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండురోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలపై వరద ప్రభావం ఆధారపడి ఉంది.

పెన్నా, వంశధారల్లో తగ్గిన వరద
► పెన్నానదిలో వరద తగ్గుముఖం పట్టింది. సోమశిల ప్రాజెక్టులోకి 13,700 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు 8,566 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 74.53, కండలేరులో 56.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గొట్టా బ్యారేజీలోకి వంశధారనది నుంచి వస్తున్న 18,693 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

గోదావరి ప్రాజెక్టులన్నీ ఫుల్‌
గోదావరినదిపై మహారాష్ట్ర, తెలంగాణల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి గోదావరి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు తోడై ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న 2,49,515 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ నిండటం రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 

మరిన్ని వార్తలు