‘కృష్ణా’లో వరద హోరు

27 Jul, 2021 03:04 IST|Sakshi
తుంగభద్ర డ్యామ్‌ నుంచి దిగువకు ఉరకలెత్తుతున్న వరద నీరు

తుంగభద్ర డ్యామ్‌ నుంచి 1.49 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

శ్రీశైలంలోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

నేడు శ్రీశైలంలోకి వరద మరింత పెరిగే అవకాశం

ఈ ఏడాది ఇప్పటివరకు 35 టీఎంసీలు కడలిపాలు

తగ్గుముఖం పట్టిన గోదావరి

బేసిన్‌లో వర్షాలు తెరిపి ఇవ్వడమే కారణం

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ దిగువకు వదులుతున్న 25,427 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి.

సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని కూడా తెలంగాణ సర్కార్‌ దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 37,712 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 4,322 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 33,390 క్యూసెక్కులను 45 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్‌ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 35 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. మరోవైపు వరద ఉధృతితో తుంగభద్ర డ్యామ్‌ నిండిపోయింది. దీంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. 

గోదా‘వడి’ తగ్గింది..
పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 5,76,833 క్యూసెక్కుల వరద చేరింది. స్పిల్‌ వే వద్ద వరద నీటిమట్టం 31.88 మీటర్లకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్‌ వే 42 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 7,93,468 క్యూసెక్కులకు తగ్గడంతో నీటిమట్టం 10.85 మీటర్లకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.

గోదావరి డెల్టా కాలువలకు 10,200 క్యూసెక్కులు వదిలి.. మిగులుగా ఉన్న 7,83,268 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద మంగళవారం మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న అనగర్లంక, పెదమల్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక, కనకాయలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు