పెన్నమ్మ మహోగ్రరూపం

28 Nov, 2020 04:02 IST|Sakshi
నెల్లూరు బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నమ్మ

ఉప నదులు ఉప్పొంగడంతో ఉగ్రరూపం దాల్చిన పెన్నా

1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే

4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

3.70 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో

సాక్షి, అమరావతి/సోమశిల: నివర్‌ తుపాను ప్రభావం వల్ల వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతున్నాయి. ఇవన్నీ పెన్నాలో కలవడంతో ఆ నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టులోకి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో గేట్లను పూర్తిగా ఎత్తేసి 3.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి సోమశిలలోకి వచ్చే వరద ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. సోమశిల ప్రాజెక్టుకు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుశస్థలి, గార్గేయ, బీమా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం, అరణియార్, మల్లెమడుగు తదితర చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటికే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోవడంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమశిల ప్రాజెక్టులోకి 78 టీఎంసీలకు గానూ 72.42 టీఎంసీలను నిల్వ చేస్తూ వరదను దిగువకు వదిలేస్తున్నారు.  

మరిన్ని వార్తలు