రేపు నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

1 Aug, 2021 03:47 IST|Sakshi

4.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో సాగర్‌లో 264.85 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ  

ఎగువ నుంచి భారీ వరద.. సోమవారానికి ప్రాజెక్టు నిండే అవకాశం 

శ్రీశైలంలోకి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. 10 గేట్లు ఎత్తివేత 

ప్రకాశం బ్యారేజీ నుంచి 26,712 క్యూసెక్కులు సముద్రంలోకి..

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల (రెంటచింతల):  కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణానది వరద ప్రవాహానికి.. సుంకేశుల నుంచి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని నిర్వహిస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద జలాలను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుత్‌ కేంద్రాల నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జున సాగర్‌లోకి 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 573.5 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 264 టీఎంసీలకు చేరుకుంది.

సాగర్‌ నిండాలంటే ఇంకా 48 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికి సాగర్‌లో నీటి నిల్వ 300 టీఎంసీలకుపైగా చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాగర్‌ గేట్లను ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాల్లో పులిచింతల ప్రాజెక్టులోకి 38,701 క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ 38,701 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఇందులో ప్రకాశం బ్యారేజీలోకి 35,346 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 26,712 క్యూసెక్కులను.. 36 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.   

మరిన్ని వార్తలు