వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు 

15 Aug, 2020 06:10 IST|Sakshi
కృష్ణానదిలో దిగువకు ప్రవహిస్తున్న వరద నీరు

సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/కర్నూలు (అగ్రికల్చర్‌) /శ్రీశైలం ప్రాజెక్ట్‌/నిడదవోలు/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో కృష్ణా, దాని ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండల్లా మారడం.. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలంలో 127.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇంకో 87 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. నాగార్జునసాగర్‌లో 243.20 టీఎంసీలు నిల్వ ఉండగా.. మరో 69 టీఎంసీలు చేరితే నిండుతుంది. పులిచింతల ప్రాజెక్టులోకి కేవలం 1,950 క్యూసెక్కులు మాత్రమే చేరుతుండటంతో నీటి నిల్వ 8.90 టీఎంసీలకు పరిమితమైంది. 

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు
పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ఖమ్మం (తెలంగాణ), గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మున్నేరు, వైరా, కట్టలేరు, కొండవాగులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 80,520 క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తి 60,707 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు.
 
ఉధృతంగా గోదావరి
గోదావరి నదిలోకి భారీగా వరద చేరుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం రాత్రి 7 గంటలకు 10 అడుగులకు చేరింది. దీంతో 175 గేట్లను ఎత్తి 7,86,935 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరింది. రాత్రి పది గంటలకు ఆ వరద ప్రవాహం తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరుతుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అంచనా వేసింది. 

బలపడుతున్న అల్పపీడనం
► ఒడిశా, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి శాఖ తెలిపింది. 
► దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం ప్రకటించింది. 
► కాగా, ఈ నెల 19న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
► దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచి సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది.
► గత 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి.

మరిన్ని వార్తలు