AP: ముంచెత్తిన వరద..వందలాది గ్రామాల్లోకి నీరు

21 Nov, 2021 03:06 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా వేముల మండలంలో వరద నీటికి తెగిపోయిన ఉద్దండ వాగు కాజ్‌ వే

అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగడంతో వందలాది గ్రామాల్లోకి నీరు

తెగిపోయిన 28 కుంటలు, చెరువులు, కాలువలు

ప్రాజెక్టులు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఆర్టీసీకి నష్టం

187.78 కి.మీ. మేర దెబ్బతిన్న పంచాయతీరాజ్‌ రోడ్లు

శనివారం నాటికి 13 మంది మృతి, పలువురు గల్లంతు

3,370 పశువులు మృతి

నెల్లూరు జిల్లాలో జల దిగ్బంధంలో పెన్నాతీరం పల్లెలు 

ట్రాక్‌పైకి వరద నీరు.. రైళ్ల రాకపోకల నిలిపివేత

భారీ వర్షాల నుంచి ఉపశమనం 

ఐదు రోజులపాటు ఒకట్రెండ్లు చోట్ల తేలికపాటి వానలే.. 

26న మరో అల్పపీడనం? 

సాక్షి ప్రతినిధి, కడప/నెల్లూరు(అర్బన్‌)/సాక్షి నెట్‌వర్క్‌: రెండు రోజులుగా బెంబేలెత్తించిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టగా.. వరద బీభత్సం నుంచి మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌ జిల్లాను వరద ముంచెత్తింది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కడప ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, 2 లక్షల 20 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు 3 లక్షల 20 వేల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో రెండు ప్రాజెక్టులు శుక్రవారం తెల్లవారుజామున తెగిపోయిన విషయం తెలిసిందే. పర్యావసానంగా చెయ్యేరు గట్లు దాటి ప్రవహించింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలో 17 గ్రామాల్లోకి నీరు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు మునిగిపోగా, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, రెస్క్యూ టీములు హెలికాఫ్టర్ల ద్వారా శుక్రవారం నుంచే గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం సాయంత్రం నాటికి 15 మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. వరి, మినుము, సజ్జ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు నీటమునిగాయి.
పెన్నా నది వరద ఉధృతికి నీట మునిగిన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీ 

నిండుకుండలా 1,451 చెరువులు
► భారీ వర్షాలతో వైఎస్సార్‌ జిల్లాలో 1,451 చెరువులు పూర్తిగా నిండగా, 250 చెరువులు 50 శాతం నిండాయి. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు, కాలువలకు భారీ నష్టం వాటిల్లింది. ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌ రోడ్లు, ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. 
► కడప–తిరుపతి, కడప–అనంతపురం, కడప–నెల్లూరు, రాయచోటి–వేంపల్లెతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
► ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే వివిధ రకాల పశువులు 3,370 మృతి చెందాయి. వేలాది ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. తెగిపోయిన అన్నమయ్య డ్యాం కట్ట ప్రాంతాన్ని శనివారం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పరిశీలించారు. 

తిరుపతి ఎంఆర్‌పల్లిలో వరద ఉధృతికి నీట మునిగిన కాలనీ 

కుంగిపోయిన పాపాఘ్ని వంతెన
వల్లూరు (కమలాపురం): కడప– అనంతపురం రోడ్డు మార్గంలో కమలాపురం–వల్లూరు మధ్య పాపాఘ్ని వంతెన కుంగిపోయింది. రాకపోకలను నిలిపివేశారు. 50 మీటర్ల పొడవు మేరకు 2 మీటర్ల లోతుకు వంతెన కుంగింది. ప్రత్యేక నిపుణులతో పరిశీలించిన తర్వాత కొత్త వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలా.. లేక మరమ్మతులు చేయాలో నిర్ణయం తీసుకుంటామని నేషనల్‌ హైవే ఈఈ ఓబుల్‌ రెబ్డి తెలిపారు. వంతెన తాత్కాలిక మరమ్మతులకు రూ.3 కోట్ల వరకు అవసరం అవుతుందన్నారు. 

పెన్నా తీరం.. భయం భయం
► పెన్నా నదికి వస్తున్న వరద కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జల దిగ్బంధంలోనే ఉంది. సోమశిల ప్రాజెక్ట్‌ నుంచి శనివారం 3.30 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో దామరమడుగు, వీర్లగుడిపాడు, కోలగట్ల దళితకాలనీ, పడుగుపాడు, గుమ్మళ్లదిబ్బ, పల్లిపాళెం, కుడితిపాళెం, పెనుబల్లి తదితర గ్రామాలు నీట మునిగాయి.  
► నెల్లూరు నగరంలోని తూకుమానుమిట్ట, జయలలితనగర్, అలీనగర్, అహ్మద్‌నగర్, ఉప్పరపాళెం, భగత్‌సింగ్‌ కాలనీని, జనార్దన్‌రెడ్డికాలనీ, వెంకటేశ్వరపురంలోని కొంతభాగం, స్టౌబీడీ కాలని తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాలను వరద చుట్టు ముట్టింది. 
► దామరమడుగు వద్ద హైవే పైకి వరద చేరుకోవడంతో ముంబయి జాతీయ రహదారిపై రాకపోకలు బంద్‌ చేశారు. మలిదేవి పొంగడంతో మన్మధరావుపేటకు పక్కనే ఉన్న విడవలూరుకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.  
► బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన షేక్‌ కరిముల్లా, అతని కొడుకు వరద నీటిలో చిక్కుకుని విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకుని తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని వారిని రక్షించాయి. తిరిగి బయటకు వచ్చే క్రమంలో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్‌ (విజయనగరం 5వ బెటాలియన్‌) లైఫ్‌ జాకెట్‌ తెగిపోవడంతో వరద నీటిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. శ్రీనివాసులది శ్రీకాకుళం జిల్లా కండిస గ్రామం. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
► బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీరంగరాజపురానికి చెందిన డీ బుజ్జయ్య (63) అనే రైతు పొలంలో ఉన్న మోటార్‌ను వరద నీటి నుంచి రక్షించుకుందామని వెళ్లి వరదలో చిక్కుకుని మృతి చెందాడు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.    
► శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నై నుంచి విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్, నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరు రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. వరద ఉధృతి తగ్గేదాకా పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు.   
► చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో మూతకనవారిగుంట చెరువు, ఎర్రగుంట చెరువులకు గండ్లుపడ్డాయి. ముష్ఠూరు గ్రామం వద్ద వరద నీటి ప్రవాహానికి కాజ్‌వే కొట్టుకుపోయింది. దెబ్బతిన్న వంతెనలు, చెరువు కట్టలు, రోడ్లను అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టారు. తిరుచానూరు స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న బ్రిడ్జిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు.   
► అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, జయమంగళి, కుముద్వతి నదుల ప్రవాహం కొనసాగుతోంది.  చెరువులన్నీ మరువలు పారుతున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 16 మందిని బోటు ద్వారా పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిశాయి. పంట నష్టం అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 

ధ్వంసమైన సోమేశ్వరాలయం 
సోమశిల: నెల్లూరు జిల్లా సోమశిలలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కామాక్షి సమేత సోమేశ్వరాలయం పెన్నానది ప్రళయానికి ధ్వంసమైంది. ఆలయ గాలిగోపురం కూలిపోవడంతో పాటు అన్నపూర్ణాదేవి గర్భగుడి, నవగ్రçహాల ఆలయం, కల్యాణ మండపం నేలమట్టమైంది. ఆలయ ప్రహరీ కూలిపోయింది. కాగా, వరద ఉధృతికి ధ్వంసమైన శివాలయ ప్రాంతంలో కొత్తగా మరో శివలింగం ప్రత్యక్షమైంది. 

భారీ వర్షాల నుంచి ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: తీవ్రమైన వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రానికి శనివారం కొంత ఉపశమనం లభించింది. మరో ఐదు రోజులపాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా మారి కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. 

26న మరో అల్పపీడనానికి చాన్స్‌
ఈ నెల 26న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపుగా వెళ్లనుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో 27వ తేదీ తర్వాత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో మచిలీపట్నంలో 99 మి.మీ., కనెకల్లులో 67, బొమ్మనహల్‌లో 65.5, పెదగంట్యాడలో 53.5, బుక్కరాయ సముద్రంలో 47, పలమనేరులో 44, బొల్లపల్లెలో 42.5, బెస్తవారిపేటలో 42, గాజువాకలో 38 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు