విశాఖలో ఆక్రమణలపై  ఉక్కుపాదం

16 Nov, 2020 02:33 IST|Sakshi
అడివివరం–శొంఠ్యాం రోడ్డులో ఉన్న భూముల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు

ప్రహరీ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

మొత్తం 66.5 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం

ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.270 కోట్లపైనే

ఫ్యూజన్‌ ఫుడ్స్‌ హోటల్‌ను స్వాధీనం చేసుకున్న వీఎంఆర్‌డీఏ అధికారులు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన వారిపైనా అధికారులు చర్యలు చేపట్టారు.

గంటా బంధువు చెరలోని భూమి స్వాధీనం
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తోడల్లుడు.. ప్రత్యూష అసోసియేట్స్‌ ప్రతినిధి, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు ఆక్రమణలో ఉన్న భూముల్ని ఆర్డీవో పెంచల్‌ కిషోర్‌ నేతృత్వంలో అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్‌ మండలం అడవివరం – శొంఠ్యాం రోడ్డులో ఉన్న విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్‌ డీడ్‌ నం.1180లో మొత్తం 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4.86 ఎకరాలు పరుచూరి భాస్కర్‌రావుకు చెందినవని తేలింది. ఈ భూమి సహా ఇతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న మొత్తం 64 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో ఉన్న రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.  మార్కెట్‌ ధర ప్రకారం ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.256 కోట్లు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. 
ఫ్యూజన్‌ ఫుడ్స్‌ హోటల్‌ని సీజ్‌ చేస్తున్న వీఎంఆర్‌డీఏ అధికారులు 

ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం ఆధీనంలో...
ఆనందపురం మండలంలోని వేములవలస, ఆనందపురం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూముల్లోని కొంత జిరాయితీ భూమిని విశ్వనాథ ఎడ్యుకేషనల్‌ సంస్థ 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ని ఏర్పాటు చేసింది. ఆ స్కూల్‌ని ఆనుకొని ఉన్న ఆనందపురం సర్వే నంబరు 283–3 లోని 1.68 ఎకరాల గయాళు భూమిని, వేములవలస సర్వే నంబరు 123 లో 34 సెంట్లు, 122–1, 122–2, 122–3లలో 76 సెంట్లు వాగు పోరంబోకుని సంబంధిత యాజమాన్యం కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా ప్రాంగణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టింది.. శనివారం ఈ నిర్మాణాల ప్రహరీ గోడలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని, హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం మార్కెట్‌ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజ్‌కు.. 
లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న  సిరిపురంలోని ఫ్యూజన్‌ çఫుడ్స్‌ అండ్‌ రెస్టారెంట్‌ను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్ధ (వీఎంఆర్‌డిఏ) ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన టి.హర్షవర్ధన్‌ ప్రసాద్‌.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్‌ పద్ధతిలో వీఎంఆర్‌డీఏ కి చెందిన 10,842 చదరపు అడుగుల స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. 2015లో ఏటా రూ.33 వేల చొప్పున చెల్లించేలా ఫ్యూజన్‌ ఫుడ్స్‌ పేరుతో తొమ్మిదేళ్ల లీజుకు తీసుకున్నారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జీవో నం.56 ప్రకారం మూడేళ్లు మాత్రమే లీజుకి ఇవ్వాల్సి ఉండగా.. అప్పటి వుడా అధికారులు టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఏకంగా తొమ్మిదేళ్లకు రాసిచ్చేశారు. ఇదిలావుండగా ఈ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ కన్య కంఫర్ట్స్‌ అనే సంస్థకు సబ్‌ లీజుకు ఇచ్చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజు కారణంగా వీఎంఆర్‌డీఏకి ప్రతి నెలా లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని భావించిన కమిషనర్‌ పి.కోటేశ్వరరావు చర్యలకు ఆదేశించారు. ఆదివారం ఉదయం వీఎంఆర్‌డీఏ కార్యదర్శి గణేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు హోటల్‌ను సీజ్‌ చేశారు.

ఆక్రమణలపై చర్యలు కొనసాగిస్తాం
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తిస్తున్నాం. సర్వే నంబర్లు, పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఆక్రమణలుంటే అక్కడ భూములు స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు దీనిని ప్రత్యేక డ్రైవ్‌లా ఇకముందు కూడా కొనసాగిస్తాం. 
–– ఆర్‌డీవో పెంచల్‌ కిశోర్‌

మరిన్ని వార్తలు