నష్టం అపారం.. కేంద్రం చూపాలి ఔదార్యం

7 Nov, 2020 03:44 IST|Sakshi

భారీ వరదల వల్ల దెబ్బతిన్న పనుల తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణకు రూ.5,279.11 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.   

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వివిధ రంగాలకు అపార నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పంటలు నీట మునిగాయి. రహదారులు, చెరువులు, కాలువలు కొట్టుకుపోవడం, గండ్లు పడటంవల్ల మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులుతోపాటు శాశ్వతంగా పునరుద్ధరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమే. కరోనా వల్ల ఆదాయాలు గణనీయంగా తగ్గిన సమయంలో వరద పోటు అన్ని రంగాలను కుంగదీసింది. వరద నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించి సాయంపై సిఫార్సు చేసేందుకు కేంద్ర బృందం ఈనెల 9, 10వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరుతూ రంగాలవారీగా రూ.6,300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. పెట్టుబడులు మట్టిపాలు కావడంపై తల్లడిల్లుతున్న రైతులకు త్వరగా నష్ట పరిహారం చెల్లించి అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నదాతలకు తీరని కష్టం కోస్తాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి నీట మునగడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ భారీ వర్షాలతో కుళ్లిపోయింది. ప్రధాన వాణిజ్య పంట పత్తి పాడైంది. మిరప, ఉల్లి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 

► ఆగస్టు నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు, వరదల వల్ల  అధికారిక గణాంకాల ప్రకారమే 2,12,587 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1,40,485 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వరి తర్వాత పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. మొత్తం 3,68,679 మంది రైతులు నష్టపోయారు.
► 24,516.71 హెక్టార్లలో ఉద్యాన పంటలు పాడయ్యాయి. మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, ఉల్లి, పసుపు వర్షాలతో దెబ్బతిన్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 80,616.94 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడం గమనార్హం. 
► వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.279.36 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని ప్రభుత్వం లెక్కలు రూపొందించింది.

రంగాలవారీగా నష్టం ఇలా..
► పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి 3,125.91 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద శాఖకు రూ.781.73 కోట్ల నష్టం వాటిల్లింది. జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనల ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ. 67.26 కోట్లు అవసరమని అంచనా.
► రహదారులు భవనాల శాఖకు చెందిన 5,583.32 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 116 చోట్ల గండ్లు పడ్డాయి. శాఖకు రూ. 2,976.96 కోట్ల మేర నష్టం జరిగింది. మౌలిక సౌకర్యాల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.283.75 కోట్లు అవసరమని అంచనా. 
► జలవనరుల శాఖ పరిధిలోని 1,081 చిన్నతరహా నీటి వనరులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడగా కొన్ని చోట్ల గట్లు కొట్టుకుపోయాయి. 142 మధ్యతరహా నీటి వనరులు, 443 భారీ నీటిపారుదల పనులు భారీ వరదల వల్ల దెబ్బతిన్నాయి. శాఖకు రూ.1,074.29 కోట్ల మేర నష్టం జరిగింది. 
► పురపాలక శాఖ పరిధిలో 399.35 కిలోమీటర్ల పొడవున రహదారులు పాడయ్యాయి. 212.25 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజి, 90.66 కిలోమీటర్ల పైప్‌లైన్‌ దెబ్బతింది. తాత్కాలిక మరమ్మతుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనావళి ప్రకారం రూ.75.40 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు