రాజధాని కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం

12 Oct, 2022 03:31 IST|Sakshi
ఆనందపురంలో జాతీయ రహదారిపై ధర్నాలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అఖిలపక్ష నాయకులు

విశాఖలో భారీ పాదయాత్ర 

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ)/ఆనందపురం (విశాఖపట్నం)/నక్కపల్లి/ఇరగవరం: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో మంగళవారం భారీ పాదయాత్ర జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు కదంతొక్కారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, మత్స్యకార డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు, క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ, మత్స్యకారుల వేషధారణలో పలువురు నాయకులు, ప్రజలు ఉత్సాహంగా కదిలారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు రాజధానులకే తమ అధినాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆనందపురం జంక్షన్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించి విశాఖ రాజధాని మా హక్కు అంటూ నినదించారు. అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డులో వెంకటేశ్వర కల్యాణమండపంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘ నాయకులు,  ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొన్నారు.  

3 రాజధానుల కోసం తీర్మానం చేస్తాం: మేయర్‌  
విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. నవంబర్‌ 4న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు.

వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ ప్రాంతంలో సమాధి అవుతాయని ఆమె చెప్పారు.  

మరిన్ని వార్తలు