నవరత్నాలతో కాపుల జీవితాల్లో వెలుగు

2 Jun, 2021 04:11 IST|Sakshi
కాపునేస్తం చెక్కుతో లబ్ధిపొందిన మహిళలు (ఫైల్‌)

రెండేళ్లలో 34.82 లక్షల మందికి రూ.9672.25 కోట్లు లబ్ధి

సాక్షి, అమరావతి: నవరత్నాలు, కాపు నేస్తం ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు భారీగా లబ్ధి చేకూర్చింది. వివిధ పథకాల ద్వారా దాదాపు 35 లక్షల మంది కాపులు ప్రయోజనం పొందారు. ఇదివరకు ఇలాంటి సహాయం ఎవరూ చేయలేదని, ఇంతగా లబ్ధి పొందుతామని తాము ఊహించనే లేదని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశంసిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందని, రిజర్వేషన్లు కల్పిస్తామని మభ్యపెట్టి పబ్బం గడుపుకుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి జగన్‌ సర్కారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తమను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నవరత్నాల ద్వారా కాపులకు కేవలం రెండేళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ భారీ ఆర్ధిక ప్రయోజనం కల్పించారు. కాపు నేస్తంతో పాటు నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 34.82 లక్షల మంది కాపులకు రూ.9,672.25 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 30.85 లక్షల మందికి నవరత్నాల పథకాల ద్వారా నేరుగా రూ.7,368.20 వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో 3.96 లక్షల మంది కాపులకు రూ.2,304.05 కోట్లు లబ్ధి చేకూర్చారు. కాపు నేస్తం కింద 3.27 లక్షల మంది అక్కలకు రూ.491.79 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 

>
మరిన్ని వార్తలు