ఆయిల్‌ పామ్‌ టన్ను రూ.22,770

30 Jun, 2022 04:14 IST|Sakshi

మూడేళ్లలో మూడు రెట్లు పెంపు 

సీజన్‌ ప్రారంభంలో టన్ను రూ.17 వేలు 

ఏడు నెలల్లో గరిష్టంగా రూ. 5,770 పెంపు 

రైతుకు ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం 

సాక్షి, అమరావతి: ఆయిల్‌ పామ్‌ రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌ టన్ను రూ.17 వేలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ)ను టన్ను రూ.22,770 చొప్పున కొనాలని ఉద్యాన శాఖ పామాయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఏడు నెలల్లోనే టన్నుకు రూ.5,770 పెరగడం గతంలో ఎప్పుడూ లేదని రైతులు చెబుతున్నారు.  

రాష్ట్రంలో 4.80 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–20లో 6,642 హెక్టార్లు, 2020–21లో 8,801 హెక్టార్లు, 2021–22లో 11,257 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి.  2020–21లో 14.94 లక్షల టన్నులు, 2021–22లో 17.22 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గంటకు 461 టన్నుల సామర్థ్యంతో 13 పామాయిల్‌ కంపెనీలు పని చేస్తున్నాయి.

ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో (ఓఈర్‌)ను బట్టి ధర చెల్లించాలి. అయితే, నాణ్యత సాకుతో గతంలో తెలంగాణ ఓఈఆర్‌ కంటే ఇక్కడ తక్కువగా చెల్లించేవారు. దీంతో రైతులు టన్నుకు రూ.4 వేలకు పైగా నష్టపోయేవారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు ఆయన్ని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఆయిల్‌ పామ్‌కు గిట్టుబాటు ధర కల్పించారు.

అప్పటివరకు 16.08 శాతం ఉన్న ఓఈఆర్‌ను 18.68 శాతానికి పెంచారు. 2018–19లో సగటున రూ.7 వేలు పలికిన టన్ను ఆయిల్‌పామ్‌ ధర ఇప్పుడు రూ.15వేలకు పైగా పెరిగింది. 2020–21లో టన్ను రూ.13,127 తో సీజన్‌ ప్రారంభం కాగా గరిష్టంగా మే–జూన్‌ నెలల్లో రూ.18,942 పలికింది. కాగా ఈ ఏడాది ఓఈఆర్‌ నిర్ధారణ కాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు, డిమాండ్‌ను బట్టి అడ్‌హాక్‌ కమిటీ నెలవారీ ధరలను ప్రకటిస్తోంది.

సీజన్‌ ప్రారంభమైన నవంబర్‌లో టన్ను రూ.17 వేలుగా అడ్‌హాక్‌ కమిటీ నిర్ణయించగా ఇదే ధరతో జనవరి వరకు కొన్నారు. ఫిబ్రవరిలో టన్ను రూ.19,300గా నిర్ణయించారు. మార్చిలో రూ.21,890, ఏప్రిల్‌లో రూ.21,940గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇదే ధరతో కొంటున్నారు. మే నెల నుంచి టన్ను రూ.22,770 చొప్పున ధర చెల్లించాలన్న అడహాక్‌ కమిటీ  నిర్ణయం మేరకు ఆయిల్‌ కంపెనీలకు ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడి పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మంచి ధర వస్తోంది
ఆయిల్‌పామ్‌కు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఓఈఆర్‌ ఎంత ఇవ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అడ్‌హాక్‌ కమిటీ నెలవారీ ధరలను నిర్ణయిస్తోంది. పూర్తిగా పక్వానికి వచ్చిన తాజా గెలలకు టన్ను రూ.22,770 చొప్పున చెల్లించాలని కంపెనీలకు ఆదేశాలిచ్చిందిది.      
– పి.హనుమంతరావు, జేడీ, ఉద్యాన శాఖ (ఆయిల్‌పామ్‌ విభాగం) 

మరిన్ని వార్తలు