హోరెత్తిన వాన 

20 Sep, 2020 05:23 IST|Sakshi
నిండిన కంభం చెరువు

19 ఏళ్ల తర్వాత నిండిన బుగ్గవంక ప్రాజెక్టు 

ఐదేళ్ల తర్వాత పాపాఘ్నికి నీరు 

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి తెల్లవార్లు్ల కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వైఎస్సార్‌ జిల్లాలోని 51 మండలాల్లో సగటున 3 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రాత్రి ఇంతస్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి. 19 ఏళ్ల తర్వాత కడప శివారులోని బుగ్గవంక ప్రాజెక్టు నీటితో నిండింది. ఐదేళ్ల తర్వాత పులివెందుల నియోజకవర్గంలోని పాపాఘ్ని నదికి నీరు చేరింది. 

వెలిగల్లు, ఝరికోన, పింఛా తదితర ప్రాజెక్టులు నీటితో నిండాయి. గత 20 ఏళ్లలో చుక్కనీరు చేరని చెరువులు ప్రస్తుతం నిండుకుండల్లా మారాయి. వేంపల్లె–ఎర్రగుంట్ల మధ్య, చాపాడు మండలంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో రాళ్లవాగు, జంపలేరు, గుండ్లకమ్మ, సగిలేరు వాగులు పొంగిపోర్లుతున్నాయి. ఆసియాలోనే పెద్దదైన కంభం చెరువు నిండుకుండలా కళకళలాడుతోంది. 

నేడు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు 
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఏర్పడిన 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో బలపడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు