తప్పుల వల్లే తిప్పలు

17 Jul, 2022 04:24 IST|Sakshi
రాజమహేంద్రవరం–కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద వరద ఉధృతి

వాతావరణ మార్పుల వల్ల 60 రోజుల్లో కురవాల్సిన వర్షం 10 రోజుల్లోనే..

దశాబ్దాలుగా పశ్చిమ, తూర్పు కనుమల్లో భారీగా అడవుల నరికివేత

గోదావరి బేసిన్‌లో ఎగువన పదేళ్లుగా ఇసుక కోసం నదీ గర్భాన్ని తవ్వేసిన వైనం

సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.

కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్‌ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. 

కుంభవృష్టి 
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్‌ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్‌లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది.

ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్‌ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్‌ బేసిన్‌లలో ఎల్లి సబ్‌ బేసిన్‌ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్‌ బేసిన్‌ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది.

భూమిలోకి ఇంకని నీరు
గోదావరి బేసిన్‌ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్‌ పెటర్నా ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు