సిక్కోలు, ఉమ్మడి విశాఖలో కుంభవృష్టి

14 Sep, 2022 04:51 IST|Sakshi
పెదపాడు జాతీయరహదారిపై వరద నీటిలో కొట్టుకుపోతున్న కారును ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యం

భీమునిపట్నంలో 17.9 సెం.మీ.. గారలో 15 సెం.మీ. వర్షపాతం 

నందిగాంలో పిడుగుపాటుకు రైతు బలి

శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయం

జాతీయ రహదారిపైకి వరద నీరు

13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు

లోటు నుంచి అధిక వర్షపాతానికి చేరుకున్న విశాఖ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెం.మీ. వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 722 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

భారీ వర్షానికి శ్రీకాకుళం నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. సూర్యమహల్‌ వద్ద ముంపు అంచనా వేయలేకపోవడంతో ఓ కారు కల్వర్టులోకి దూసుకెళ్లిపోయింది. పెదపాడు చెరువు పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు మునిగిపోయేంత మేర నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై నీటిని కల్వర్టుల ద్వారా మళ్లించారు. ఇక నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన రైతు కొల్లి వనజనాభం (40) పొలంలో నీటిని మళ్లిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. భారీ వర్షాలతో 13 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఉమ్మడి విశాఖలోనూ కుండపోత..
మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కుంభవృష్టి కురిసింది. సోమవారం అర్థరాత్రి దాటాక మొదలైన వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. విశాఖ నగర శివారుల్లో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. భీమునిపట్నంలో అత్యధికంగా 17.9 సెం.మీల వర్షపాతం రికార్డయింది. గోపాలపట్నంలో 12.1, విశాఖ రూరల్‌లో 10.8, గాజువాక 8.2, అనకాపల్లి జిల్లా పరవాడలో 6.3, అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 4.6 సెం.మీల చొప్పున వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. 

రుతుపవన ద్రోణితో భారీ వర్షాలు
ఇక రుతుపవన ద్రోణి చురుగ్గా ఉండడం భారీ వర్షాలకు దోహదపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లా మాత్రమే లోటులో ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు ఈ జిల్లా వర్షపాతం సాధారణం కంటే 20.9 శాతం లోటులో ఉండేది. కానీ, ప్రస్తుత వర్షాలతో 3.9 శాతం అధిక వర్షపాతానికి చేరుకుంది. అంటే మూడ్రోజుల వ్యవధిలో దాదాపు 24 శాతం వర్షపాతం పెరిగినట్లయింది. 

మరిన్ని వార్తలు