జోరుగా వానలు

3 May, 2023 04:10 IST|Sakshi
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో రహదారిపై నిలిచిన వర్షపు నీరు

అనకాపల్లి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ సగటు వర్షం

తిరుపతి జిల్లా నారాయణ వనంలో అత్యధికంగా 103 మి.మీ. వర్షపాతం

రాబోయే రెండ్రోజులు ఇంకా విస్తృతంగా కురిసే అవకాశం

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావమే కారణం 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వానా­కాలాన్ని తలపించేలా అన్ని ప్రాంతాల్లో వాతా­వరణం పూర్తిగా మారిపోయింది. గడచిన 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా నారాయణవనంలో అత్యధికంగా 103.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 96.2, సూళ్లూరు­పేటలో 88.4, కుమార వెంకట భూపాలపురంలో 87.8, పెళ్లకూరులో 74.8, గూడూరులో 73.2, పుత్తూరులో 67.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో 92.2, ముమ్మిడివరంలో 85.4, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 91 మి.మీ. వర్షం పడింది. ఇక సోమవారం ఉ.8.30 గంటల నుంచి మంగళవారం ఉ.8.30 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో సగటున 36.11 మి.మీ. వర్షం పడింది. అంబేద్కర్‌ కోనసీమలో 31.89, కాకినాడ జిల్లాలో 33.03, తిరుపతి జిల్లాలో 31.55 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తంగా 9.81 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. 

మండలాల్లో అత్యధిక వర్షం ఇలా..
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అత్యధికంగా 79 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 61.50, కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో 48.75, ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో 67.75, పల్నాడు జిల్లా పెదకూరపాడులో 68, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 58.25, వైఎస్సార్‌ జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలంలో 44 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి
మరోవైపు.. విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ విస్తరించి ఉన్న ద్రోణి (గాలుల కోత) మధ్యప్రదేశ్‌ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉంది. అలాగే.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ/దక్షిణ దిశలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఎండలు మండినా వర్షాలూ ఎక్కువే
ఇక ఇప్పటికే మే నెలను తలపించేలా ఏప్రిల్‌లో ఎండలు మండగా.. పది రోజులకు పైగా వడగాడ్పులూ వీచాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఎగబాకి జనాన్ని బెంబేలెత్తించాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఏప్రిల్‌ నెలలో వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 21.9 మిల్లీమీటర్లు కాగా.. 27.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దానికంటే 26 శాతం అధికంగా వర్షం కురిసింది.

కోస్తాంధ్ర–యానాం సబ్‌ డివిజన్‌లో 17.1 మి.మీలకు గాను 61 మి.మీలు (257 శాతం అధికంగా), రాయలసీమ సబ్‌ డివిజన్‌లో 19 మి.మీలకు 24.9 (31 శాతం అధికంగా) వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 73.8 మి.మీలు (+327 శాతం) రికార్డయింది. అత్యల్ప వర్షపాతం కురిసిన జిల్లాల్లో విశాఖ జిల్లా ఉంది. ఇక్కడ 27 మి.మీలు కురవాల్సి ఉండగా 4.1 మి.మీలు మాత్రమే నమోదైంది. 

మరో 3 రోజులు వర్షాలు, పిడుగులు
మరో మూడ్రోజులు పిడుగు­లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూ­రు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు