విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన

1 Nov, 2022 05:20 IST|Sakshi
చోడవరంలో భారీ ర్యాలీ

ఇక ఉద్యమం ఉధృతం

ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్‌ లజపతిరాయ్‌ 

చోడవరంలో వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ

చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.లజపతిరాయ్‌ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు.

అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్‌ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్‌ కాండ్రేగుల డేవిడ్‌ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు.   

అడ్డుకునే వారి ఆటలు సాగవు 
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్‌ అండ్‌ పెట్రోలియం కారిడార్‌ చైర్‌పర్సన్‌ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్‌ కన్వీనర్‌ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు