సంపూర్ణ హక్కుతో నిశ్చింత

21 Nov, 2021 13:02 IST|Sakshi

రిజిస్టర్డ్‌ స్థలాలు కలిగిన వారు 4 శాతం మందే

మిగిలిన 96% మంది పొజిషన్‌ సర్టిఫికెట్లు, డీ పట్టాదారులే

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లక్షల మంది పేదలకు భారీ లబ్ధి చేకూరుతోంది. పేదల ఆస్తుల విలువ పెరగడంతో పాటు పూర్తి భద్రత దక్కుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ నిర్మించిన ఇళ్లకు గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే.   

అత్యధికంగా పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ 
గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న పేదల్లో పొజిషన్‌ సర్టిఫికెట్, డీ పట్టాదారులే ఎక్కువ మంది ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న 51.8 లక్షల మంది వివరాలను మునిసిపాలిటీలు/పంచాయతీలకు బదిలీ చేసింది. వీరిలో 45.5 లక్షల మంది వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలకు ట్యాగ్‌ చేశారు. వలంటీర్లు,  మునిసిపల్, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు, స్థల స్వభావాన్ని గుర్తిస్తున్నారు. 76 శాతం మందికి పొజిషన్‌ సర్టిఫికెట్‌లు, 20 శాతం మందికి డీ పట్టాలుండగా కేవలం 4 శాతం మంది మాత్రమే రిజిస్టర్డ్‌ స్థలాలు కలిగిన వారున్నట్లు వెల్లడైంది. 

గతంలో వడ్డీ మాఫీలు మాత్రమే 
గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి గత ప్రభుత్వాలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కింద వడ్డీల్లో మాత్రమే రాయితీ ఇస్తూ వచ్చాయి. రాయితీ పోనూ రుణం చెల్లించిన వారికి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి తనఖాలో ఉన్న ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ రూపంలో అసలు, వడ్డీ రెండిటికి రాయితీ ఇవ్వడంతో పాటు పేదలకు ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కుల కల్పనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఫీజులు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా పేదలకు భారీ ఊరట లభించనుంది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌లలో విలువపై 7.5 శాతం ఫీజులు, చార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడు అవేవీ లేకుండా రుణగ్రహీతలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20 వేలు చెల్లిస్తే స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  

పలు ప్రయోజనాలు 
గృహ నిర్మాణ సంస్థ సహకారంతో రుణాలు తీసుకున్న వారంతా రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు, ఇతర పనులకు వెళ్తూ పొట్టపోసుకునేవారే. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో డబ్బు అవసరమై బ్యాంకులకు వెళితే రుణాలు అందక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమించడం వల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.  

డీ పట్టా, పొజిషన్‌ సర్టిఫికెట్‌ స్థలాలకు మార్కెట్‌లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్టర్‌ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది.  
డీ పట్టా, పొజిషన్‌ సర్టిఫికెట్‌లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వం జారీ చేసే విక్రయపత్రం ద్వారా ఆస్తులను వారసుల పేర్లపై బదలాయించుకోవడంతో పాటు ఇతరులకు అమ్మడానికి హక్కులు లభించనున్నాయి.  
అమాయకులైన పేదలను మోసగించి తప్పుడు పత్రాలతో కబ్జాలకు పాల్పడే ఆస్కారం లేకుండా ఆస్తులకు పూర్తి భద్రత లభిస్తుంది.

మా ఆస్తికి మరింత విలువ
నా భర్త ముఠా కూలీ. డీ పట్టా స్థలంలో 2004–2008 మధ్య ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం సుమారు రూ.40 వేలకు చేరుకుంది. ఇటీవల వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. రూ.15 వేలు చెల్లిస్తే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే హక్కు పత్రం ద్వారా వారసులకు ఆస్తి బదలాయించడంతో పాటు ఇతరులకు అమ్ముకోవచ్చని చెప్పారు. యాజమాన్య హక్కులు కల్పిస్తే మా ఆస్తికి విలువ పెరుగుతుంది. మాకు బ్యాంక్‌ రుణాలు మంజూరు అవుతాయి. చాలా సంతోషంగా ఉంది.
– మర్రి ప్రసన్నలక్ష్మి, తెనాలి, గుంటూరు జిల్లా 

మరిన్ని వార్తలు