అవినీతిపై తిరుగులేని అస్త్రం

23 Nov, 2020 03:30 IST|Sakshi

డయల్‌ 14400కి విశేష ఆదరణ

జనచైతన్యం.. టోల్‌ ఫ్రీ నంబరుకు సమాచార ప్రవాహం

55 వేలకు పైగా కాల్స్‌..

అవినీతిపరుల ఆటకట్టిస్తున్న ఏసీబీ

ఏడాదిగా బాసట.. ఎందరికో ఊరట

పాస్‌పుస్తకానికి లంచం అడిగితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు శ్యామల సురేష్‌రెడ్డి తన పొలానికి పాస్‌పుస్తకం తెచ్చుకునేందుకు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లాడు. ఇందుకోసం మండల సర్వేయర్‌ రూ.27 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో సురేష్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 9న 14400 నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్‌ మాండ్రుమాక రాజు, చైన్‌మెన్‌ గంజిమళ్ల చిత్తరంజన్‌లను పట్టుకుని కేసు నమోదు చేశారు.

ధ్రువపత్రానికి లంచం తీసుకున్న డాక్టర్‌.. శ్రీకాకుళం జిల్లా హరిపురం గ్రామానికి చెందిన ఆర్‌.ఈశ్వరి పలాస ప్రభుత్వాస్పత్రిలో కాన్పు అనంతరం ఆపరేషన్‌ చేయించుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడానికి, జనన ధ్రువీకరణపత్రం ఇవ్వడానికి ఆ ఆస్పత్రి డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి లంచం డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఈశ్వరి తల్లి ప్రవల్లిక 14400 నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి 20న రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మిని, ఆమెకు సహకరించిన ల్యాబ్‌ అసిస్టెంట్‌ పి.కృష్ణారావును అరెస్టు చేశారు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘లెక్కలేని’ సొమ్ము.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తాండవిస్తోందంటూ 14400 నంబరుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జనవరి 10న రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి. ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన రెండురోజుల్లోనే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సోదాలు చేయించారు. ఆయా కార్యాలయాల్లో లెక్కల్లో చూపని రూ.10.27 లక్షల్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా పలు మండల రెవెన్యూ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. 

సాక్షి, అమరావతి: కళ్లముందే అవినీతి జరుగుతుంటే మనకెందుకులే అని సరిపెట్టుకునే రోజులు పోయాయి. అవినీతి గురించి విన్నా.. చూసినా.. తెలిసినా.. అరక్షణం ఆలస్యం చేయకుండా సామాన్యులు సైతం డయల్‌ 14400కు సమాచారం అందిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సంధించిన టోల్‌ ఫ్రీ నంబరు 14400 జనాస్త్రం ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత శక్తిమంతంగా పనిచేస్తోంది. గత ఏడాది నవంబర్‌ 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఈ నంబరుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 55,049 మంది ఈ నంబరుకు ఫోన్‌ చేశారు. 

అవినీతి అంతు చూడటంలో ప్రజాచైతన్యం
అవినీతి అంతు చూడటంలో సామాన్యుడు సైతం చైతన్యంతో వ్యవహరిస్తున్నాడు. గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వశాఖల్లో అవినీతి గణనీయంగా తగ్గింది. ఎక్కడ అవినీతి జాడ కన్పించినా కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టోల్‌ ఫ్రీ నంబరుకు వచ్చిన అత్యధిక ఫిర్యాదులపై ఏసీబీ చర్యలు తీసుకున్న జిల్లాల్లో తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలు వరుసగా మూడుస్థానాల్లో ఉన్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్‌శాఖల్లోని పలువురు అధికారులు, ఉద్యోగులపై అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పౌర సేవలకు డబ్బు డిమాండ్‌ చేయడం, నిధుల దుర్వినియోగం, అధికారుల అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు వంటివాటిపై ఫోన్లు వస్తున్నాయి.

అవినీతిపై ఫిర్యాదుకు..
అవినీతిపై 14400 నంబరుకు కాల్‌ చేయడంతోపాటు మరికొన్ని మార్గాల ద్వారా కూడా ఏసీబీకి సమాచారం ఇవ్వవచ్చు. వాటి ద్వారా కూడా ఏసీబీకి నెలకు సగటున 300కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టోల్‌ ఫ్రీ నంబరు 1064కు ఫోన్‌ చేయవచ్చు. 8333995858 నంబరుకు వాట్సాప్‌ ద్వారా,  dg_acb@ap. gvo.inకు ఈ మెయిల్‌ ద్వారా,  dgacbap ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా,twitter@dgacbapకి సమాచారం ఇవ్వవచ్చు.

ఏసీబీకి సంబంధించిన కాల్స్‌పై ఎప్పటికప్పుడు చర్యలు
అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) పనితీరును సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహితంగా ప్రజలకు సత్వరసేవలు అందేలా చూడాలని, ఇందుకు డయల్‌ 14400కు వచ్చే ఫిర్యాదులపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీంతో ఈ నంబరుకు వచ్చే వాటిలో తమకు సంబంధించినవాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. లంచం అడుగుతున్నారంటూ కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై 15 రోజుల్లోను, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతోపాటు ఇతర కీలక కేసులపై వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించుకుని 30 రోజుల్లోను చర్యలు తీసుకుంటున్నారు. ఏసీబీకి ఈ నంబరు ద్వారాను, ఇతర మార్గాల్లోను అవినీతికి సంబంధించిన పూర్తి సమాచారంతో 2,033 ఫిర్యాదులు అందాయి. వీటిలో 1,907 ఫిర్యాదుల్ని పరిష్కరించగా 126 పరిష్కరించాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఏసీబీ నేరుగా రంగంలోకి దిగి 168 కేసులు నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు