సెగలు పుట్టిస్తున్న ఎండ

1 Apr, 2021 03:33 IST|Sakshi

ఈ సీజన్‌ ప్రారంభంలోనే తొలిసారి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత 

బెజవాడలో రికార్డు స్థాయి ఎండ 

ఉపరితల ఆవర్తనం వల్ల వీస్తున్న బలమైన గాలుల వల్లే వేడి

ఉత్తరాంధ్రలో ప్రభావం ఎక్కువ

రాష్ట్రంలోని 110 మండలాల్లో తీవ్రమైన వడగాలులు

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తోంది. ఈ సీజన్‌లో బుధవారం తొలిసారి 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మార్చి నెలలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని 670 మండలాలకుగాను 110 మండలాల్లో బుధవారం ఎక్కువ ఉష్ణోగ్రత, తీవ్రమైన వడగాలులు వీచాయి. మరో 207 మండలాల్లో ఎండ, వడగాడ్పుల ప్రభావం కనిపించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, విశాఖలో 18, తూర్పుగోదావరిలో 13, కృష్ణాలో 11, గుంటూరు జిల్లాలో 15, ప్రకాశంలో 10 మండలాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన వడగాలులు వీచాయి. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తుల నిర్వహణ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వడగాలుల బారిన పడకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. 

68 ఏళ్ల తర్వాత బెజవాడలో రికార్డు ఉష్ణోగ్రత
బెజవాడలో భానుడు రికార్డు సృష్టించాడు. 68 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. బుధవారం ఇక్కడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మార్చిలో ఇంతలా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. 1953 మార్చి 29న విజయవాడలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మార్చిలో ఇప్పటివరకు ఇదే ఆల్‌టైం రికార్డుగా భారత వాతావరణ విభాగం గుర్తించింది. బుధవారం నమోదైన 43 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికం.

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు 
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర అండమాన్‌ సముద్రం, పరిసరాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మంగళవారం సాధారణం కంటే 5.1 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 2, 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు, 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచర్చికలు, వివరాలు, ఈదురుగాలుల వివరాలు తెలుసుకోవడానికి మౌసమి, మేఘదూత్, దామిని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐఎండీ సూచించింది.

4 వరకు ఇదే పరిస్థితి..
రాబోయే రోజుల్లో రాష్ట్రంపై వడగాలుల తీవ్రత పెరగనుంది. ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఇదే సమయంలో సూర్యుడు భూ మధ్య రేఖని దాటి.. భారత్‌పై ఉంటున్న సమయంలో ఈ గాలులు వీస్తుండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడి వడగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈ తీవ్రత ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 

మరిన్ని వార్తలు