ఊరూ వాడా 'ఫ్యాన్‌' సునామీ..

20 Sep, 2021 04:42 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద గెలుపొందిన ఆనందంలో గణపవరం మండలానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు

కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ విజయపరంపర

మొన్న పంచాయతీల్లో మద్దతుదారుల హవా

నిన్న మునిసిపల్‌ ఎన్నికల్లో విజయభేరి

12 కార్పొరేషన్లూ క్లీన్‌ స్వీప్‌

98.66 శాతం మున్సిపాలిటీల్లో ఘన విజయం

నేడు 13 జెడ్పీలపై ఫ్యాన్‌ రెపరెపలు

2019 ఎన్నికల తర్వాత పార్టీ పట్ల ప్రజాదరణ రెట్టింపు 

సీఎం జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజా దీవెన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఊరూ వాడా ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ.. ఆ తర్వాత గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అప్రతిహతంగా జైత్ర యాత్ర కొనసాగించింది. పట్నం అయినా.. పల్లె అయినా.. ఎన్నికలు ఎప్పుడైనా.. ఓటింగ్‌ ఈవీఎంలతోనైనా.. బ్యాలట్‌ పత్రాలతోనైనా.. అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. విజయభేరి మోగించేది వైఎస్సార్‌సీపీయేనని ప్రజలు మరోసారి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజా దీవెన అని పునరుద్ఘాటించారు. సంక్షేమ, అభివృద్ధి పాలనకే తమ ఓటని కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్ష టీడీపీ కుట్రలు, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని చంద్రబాబు చేసే కుతంత్రాలను ఓటర్లు తిరస్కరించారు. ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు.

ఆ తర్వాత మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో పట్నం ఓటరు ఫ్యాన్‌కు పట్టం కట్టగా, తాజాగా పరిషత్‌ ఎన్నికల్లో పల్లె ఓటర్లు కూడా ఫ్యాన్‌ను విజయపల్లకి ఎక్కించారు. రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్‌సీపీకి రికార్డు స్థాయిలో ఘన విజయాన్ని అందించారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 86 శాతం ఎమ్మెల్యే సీట్లు, 88 శాతం ఎంపీ సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ పట్ల ఈ రెండున్నరేళ్లలో ప్రజాదరణ మరింతగా పెరిగిందని మునిసిపల్, పరిషత్‌ ఎన్నికలు విస్పష్టంగా నిరూపించాయి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మునిసిపల్‌ ఎన్నికల్లో ఏకంగా 100 శాతం కార్పొరేషన్లు, 98.66 శాతం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. ఇక ఆదివారం ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రీతిలో విజయఢంకా మోగించింది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్తులపై కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేసింది. 

100 శాతం కార్పొరేషన్లు.. 84 శాతం డివిజన్లు
ఇటీవల ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్‌ కార్పొరేషన్లను వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ 12 కార్పొరేషన్లలో మొత్తం 670 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవాలతో సహా 562 డివిజన్లలో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 81 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు 27 చోట్ల గెలిచారు. మొత్తం మీద 84 శాతం డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. దాంతో తిరుగులేని రీతిలో మెజార్టీ డివిజన్లు గెలుచుకోవడంతో ఆ 12 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 

98.66 % విజయాలతో 74 మునిసిపాలిటీల్లో గెలుపు
ఎన్నికలు నిర్వహించిన 75 మునిసిపాలిటీలలో 74 మునిసిపాలిటీలను గెలుచుకుంది. మొత్తం 2,124 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవాలతోసహా 1,754 వార్డుల్లో ఘన విజయం సాధించింది. అంటే 82.50 శాతం వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 270 వార్డులతోనే సరిపెట్టుకుంది. ఇతరులకు 100 వార్డులు దక్కాయి.

వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న 74 మునిసిపాలిటీలలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్లలో అన్ని వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాయచోటి, ఎర్రగుంట్ల, కనిగిరి, ధర్మవరం, వెంకటగిరి, తుని మునిసిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని వార్డుల్లోనూ విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసింది. నిడదవోలు, ఆదోని, డోన్, సూళ్లూరుపేట, గుత్తి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల్లోనూ విజయం సాధించింది. మొత్తం మీద మున్సిపల్‌ ఎన్నికల్లో 98.66 శాతం విజయాలతో 74 మునిసిపాలిటీలపై విజయకేతనం ఎగురవేసింది. టీడీపీకి కేవలం ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీయే దక్కింది.  

మరిన్ని వార్తలు