'పెన్నా' పరవళ్లు

7 Nov, 2021 04:05 IST|Sakshi

నీటి జాడలేని నదిలో రెండున్నరేళ్లుగా జల సవ్వడి 

మూడు దశాబ్దాల తర్వాత పెన్నా బేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు 

2019, 2020లలో పెన్నా, ఉప నదుల పరవళ్లు.. ఈ ఏడాదీ ఉరకలు 

పెన్నా ప్రధాన పాయపై ప్రాజెక్టులన్నీ ఫుల్‌.. గరిష్టంగా నీటి నిల్వ 

పెన్నా చరిత్రలో ఇదే రికార్డు 

రెండున్నరేళ్లుగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మారిన బతుకు చిత్రం 

పాడి పంటలతో పెన్నా ఆయకట్టు సస్యశ్యామలం 

దిగువ తరహాలోనే ఎగువనా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక 

సాక్షి, అమరావతి: నీటిచుక్క జాడలేక ఎడారిలా మారిన పెన్నా నది ఇప్పుడు జీవనదిగా అవతరించింది. మూడు దశాబ్దాల తర్వాత 2019లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాది, ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ ఉరకలెత్తుతోంది. బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. పెన్నా, ఉప నదులు ఉధృతంగా ప్రవహించడంతో బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిపోయాయి.

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినా.. ఖరీఫ్‌ పంటలకు వాడుకోగా ఇప్పటికీ ప్రాజెక్టుల్లో 175.91 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 157.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.07 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం. మొత్తం మీద ప్రాజెక్టులన్నీ నిండటం.. పెన్నా ప్రవాహంతో భూగర్భ జలాలు పెరగడంతో పాడిపంటలతో బేసిన్‌ సస్యశ్యామలమైంది. 

సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో.. 
గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకోవడం.. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంవల్ల ఆ నదులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తాయి. కానీ, పెన్నా తద్భిన్నం. వర్ష ఛాయ (రెయిన్‌ షాడో) ప్రాంతంలో జన్మించి.. ప్రవహించే ప్రాంతంలో సగటున 400–800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఎల్‌నినో.. లానినో పరిస్థితుల ప్రభావంవల్ల నైరుతి రుతుపవనాల గమనం ఆధారంగా పెన్నా బేసిన్‌లో వర్షాలు కురుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పెన్నా బేసిన్‌. జైసల్మేర్‌ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా ఈ బేసిన్‌లోనే ఉంది.

కర్ణాటకలో 1995 నుంచి 2004 మధ్య నందిదుర్గం నుంచి నాగలమడక వరకూ ఆ రాష్ట్ర సర్కార్‌ పెన్నాపై భారీఎత్తున చెక్‌ డ్యామ్‌లు, డ్యామ్‌లు నిర్మించింది. పెన్నా ఉప నదులైన చిత్రావతిపై పరగోడు వద్ద డ్యామ్‌ నిర్మించింది. జయమంగళి, కుముద్వతిపైనా అదే రీతిలో చెక్‌ డ్యామ్‌లు నిర్మించడంతో పెన్నా, ఉప నదుల నుంచి.. ఎగువ నుంచి దిగువకు చుక్కనీరు రాకుండాపోయింది. అదే సమయంలో రాయలసీమలో సక్రమంగా వర్షాలు కురవక.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పెన్నా ఎండిపోయింది. 2019 నుంచి రాష్ట్రంతోపాటూ రాయలసీమలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెన్నా వరదకు కృష్ణా వరదను తోడుచేసి.. గత రెండేళ్లుగా గండికోట, సోమశిల, కండలేరు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో తొలిసారిగా గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వచేశారు.  

జీవనదిగా పెన్నమ్మ రూపాంతరం 
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. పెన్నా ప్రధాన పాయపై అనంతపురం జిల్లాలో పెండేకళ్లు, చాగల్లు, వైఎస్సార్‌ కడప జిల్లాలో గండికోట, మైలవరం, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరుల్లో 2019, 2020, ఈ ఏడాదీ గరిష్ఠస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఉప నదులైన చిత్రావతిపై అనంతపురం–వైఎస్సార్‌ కడప సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, మద్దిలేరు (యోగి వేమన) ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది పాపాఘ్ని ఉప్పొంగడంవల్ల వైఎస్సార్‌ జిల్లాలోని వెలిగల్లు నిండిపోయింది. చెయ్యేరు, సగిలేరుపై ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. బాహుదా ఉరకలెత్తడంతో చిత్తూరు జిల్లాలోని బాహుదా ప్రాజెక్టు, పెద్దేరు నిండిపోయాయి.  

ఎగువన పెన్నమ్మకు పునరుజ్జీవం 
కర్ణాటక చెక్‌ డ్యామ్‌లు, డ్యామ్‌ల నిర్మాణంతో ఎగువ నుంచి పెన్నాకు వరద రాకపోవడంవల్ల కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లాలో ఉన్న పేరూరు డ్యామ్‌ (అప్పర్‌ పెన్నార్‌) నుంచి పీఏబీఆర్, మధ్య పెన్నార్‌ వరకూ పెన్నా ఒట్టిపోయింది. దీంతో దిగువ రీతిలో ఎగువన కూడా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాపాఘ్ని, స్వర్ణముఖి ఉప నదులనూ పునరుజ్జీవింపజేసే చర్యలను వేగవంతం చేసింది.  

వాతావరణ మార్పుల వల్లే.. 
వాతావరణ మార్పులవల్ల వర్షాలు పడే రోజులు తగ్గాయి. కానీ.. వర్షంపడే రోజుల్లో ఒకేసారి కుండపోత కురుస్తోంది. దీనివల్ల చెరువులు నిండి.. పెన్నాలోకి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా 2019 నుంచి పెన్నా, ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాడిపంటలతో ఈ బేసిన్‌ సస్యశ్యామలమవుతోంది. ఎగువన పెన్నా నదిని పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం శుభపరిణామం. 
– డాక్టర్‌ మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్‌ ఫెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం 

సవ్యమైన రీతిలో జలచక్రం 
ఎన్నడూలేని రీతిలో 2019 నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంవల్ల పెన్నా, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. పెన్నా వరద జలాలకు కృష్ణా వరద జలాలను జతచేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపింది. ఇది పెన్నాలో వాతావరణ సమతుల్యతకు దారితీసింది. జలచక్రం సవ్యమైన రీతిలో మారడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే జీవనదిగా పెన్నా అవతరించడానికి బాటలు వేస్తోంది.  
– మురళీనాథ్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్, కర్నూలు జిల్లా  

మరిన్ని వార్తలు