అభయారణ్యంలో అలుగుల వేట

20 Sep, 2020 09:58 IST|Sakshi

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులు అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్‌ అని కూడా పిలుస్తారు. వీటి మూతి ముంగీసను పోలి ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. వీటి చర్మంపై ఉండే పెంకులు (పొలుసులు) దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకూ సంచరిస్తున్నట్లు వైల్డ్‌ లైఫ్‌ అధికారులు చెప్పారు. అలుగులు రాత్రి సమయంలోనే ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. ఇవి సంచరిస్తున్న సమయంలో ఎటువంటి అలికిడి వచ్చినా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. వీటి వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును తేలి గట్టిగా ఉంటాయి.  

అలుగులపై వేటగాళ్ల కన్ను 
అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై వేటగాళ్ల కన్ను పడింది. అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలుగు పెంకులను చైనాలో మెడిసిన్‌ తయారీకి ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీంతో అటవీప్రాంతంలో కూడా అలుగుల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అలుగును పట్టుకుని రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్‌బుక్‌లో అలుగు వీడియోను అప్‌లోడ్‌ చేశారు. దీనిపై అధికారులు స్పందించి అలుగును అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అరుదైన వన్య ప్రాణులను పట్టుకుని విక్రయించాలని చూస్తే చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధిస్తారని వైల్డ్‌ లైఫ్‌ అధికారులు పేర్కొన్నారు. 

వన్యప్రాణులను వేటాడితే శిక్షిస్తాం 
చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.  
– జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి, పోలవరం   

మరిన్ని వార్తలు