భార్య కళ్లముందే గుండెపోటుతో భర్త మృతి  

1 Oct, 2021 08:15 IST|Sakshi
కొత్తవలస ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కుప్పకూలి మృతిచెందిన తాతాలు  

బ్యాంకుకు వచ్చి.. కుప్పకూలి.. 

కన్నీటిపర్యంతమైన వృద్ధురాలు  

కొత్తవలస స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎం వద్ద ఘటన

కొత్తవలస: ఆయన రైల్వే విశ్రాంత ఉద్యోగి. ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో భార్యతో కలిసి బయలుదేరారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా.. కష్టసుఖాలు చెప్పుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు మెట్లు ఎక్కనేలేదు. అక్కడ ఉన్న ఏటీఎం వద్ద ఒక్కసారిగా వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో వృద్ధురాలైన భార్య తెలుసుకునేలోపే ప్రాణం విడిచిన హృదయవిదారక ఘటన కొత్తవలస స్టేట్‌బ్యాంకు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...  

ఎల్‌.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన బోదం తాతాలు(75) రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈయన ఇద్దరు పిల్లలకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ మల్లివీడులో ఉంటున్నారు. పెన్షన్‌ డబ్బుల డ్రా చేసేందుకు భార్య రాములమ్మతో కలిసి బ్యాంకుకు బయలుదేరారు. బ్యాంకులోకి వెళ్లక ముందే తాతాలు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. భర్త మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమైంది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మృతుడిని ఆటోలో స్వగ్రామానికి తరలించారు.  

చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి)

మరిన్ని వార్తలు