చంటిబిడ్డతో రాత్రంతా జాగారం

10 Aug, 2020 08:03 IST|Sakshi
ఓబుళంపల్లెలో భర్త ఇంటి వద్ద చంటిబిడ్డతో తేజస్విని

ఇంట్లోకి రానీయని అత్తింటివారు  

భర్త కోసం పోలీసులను ఆశ్రయించిన యువతి

వాల్మీకిపురం : ఓ యువతిని అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. ఫలితంగా ఆమె రాత్రంతా చంటిబిడ్డతో కలిసి గుడిలో జాగారం చేసింది. తెల్లారాక మరోమారు వేడుకున్నా అత్తింటివారు కరుణించలేదు. అయినా “నా భర్త కావాలి.. నాకు న్యాయం చేయండి’ అంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది. వాల్మీకిపురం మండలంలో ఆదివారం జరిగిన హృదయ విదారక సంఘటన ఇదీ. చౌడేపల్లె మండలం చిట్టిరెడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె తేజస్విని(25)కి వాల్మీకిపురం మండలం ఓబుళంపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాలాజీ(30)తో  రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య చిన్నచిన్న తగాదాలు ప్రారంభయ్యాయి. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. కొంత కాలంగా అమ్మగారింట్లో ఉన్న తేజస్విని ఐదు నెలల చంటిబిడ్డతో శనివారం సాయంత్రం అత్తవారింటికి వెళ్లింది. అత్తింటివారు ఇంట్లోకి అనుమతించలేదు. ఇంటి ముందే ఎంతసేపు నిరీక్షించినా ఎవరూ కనికరించలేదు. చివరకు బిడ్డను ఒడిలో ఉంచుకుని ఇంటికి ఎదురుగా ఉన్న ఆలయంలోనే రాత్రంతా తలదాచుకుంది. ఆదివారం ఉదయం కూడా ఎంత బతిమాలినా అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. చివరకు వాల్మీకిపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తన భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఐ శివభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరులు తెలిపారు. 

మరిన్ని వార్తలు