చిన్నారి ఇంద్రజకు హైడ్రోసిఫలిస్‌

25 Nov, 2022 04:31 IST|Sakshi
చిన్నారిని పరీక్షిస్తున్న న్యూరోసర్జన్‌ డాక్టర్‌ కృష్ణచైతన్య

సీఎం ఆదేశాల మేరకు స్పందించిన కలెక్టర్, డీఎంహెచ్‌వో

జెమ్స్‌ ఆస్పత్రిలో బాలికను పరీక్షించిన న్యూరోసర్జన్‌ 

వ్యాధి నిర్ధారణ... చికిత్స ప్రారంభం

శ్రీకాకుళం రూరల్‌: విజయనగరం జిల్లా శిర్ల గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి, అప్పలనాయుడు దంపతుల కుమార్తె ఇంద్రజకు శ్రీకాకుళం మండలం రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో గురువారం చికిత్స మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ వెంటనే డీఎంహెచ్‌వో డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షితో మాట్లాడి జెమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేయించారు.

న్యూరోసర్జన్‌ డాక్టర్‌ కృష్ణచైతన్య ఆ చిన్నారిని పరీక్షించి హైడ్రోసిఫలిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. పుట్టినప్పటి నుంచి ఇంద్రజ బ్రెయిన్‌లో నీరు చేరడంతో తల పెరిగిందని, శారీరక ఎదుగుదల నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగున్నా, రక్త పరీక్షలు, బ్రెయిన్‌ స్కానింగ్‌ చేయాల్సి ఉందన్నారు.

ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ  వర్తిస్తుందని, అవసరమైతే బీవీ సెంటింగ్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు. డాక్టర్‌ కృష్ణచైతన్యతోపాటు డాక్టర్‌ సుధీర్‌ కూడా ఉన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించి చిన్నారి ఇంద్రజకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా కల్పించిన విషయం విదితమే.  

మరిన్ని వార్తలు