భారత విద్యా రంగం ఉద్యోగ, ఉపాధికి స్వర్గధామం

26 Nov, 2020 18:47 IST|Sakshi

దేశ జనాభాలో 29 శాతం విద్యా రంగం వినియోగదారులే

పాఠశాల విద్యలో రూ.13.32 లక్షల కోట్లకు చేరుకోనున్న పెట్టుబడులు

ఉన్నత విద్యలో రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు

కోవిడ్‌లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, బ్లెండెడ్‌ మోడ్‌ విద్య

ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ విశ్లేషణ

సాక్షి, అమరావతి: భారత విద్యా రంగం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశాల్లో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో మూడింట ఒక వంతు జనాభా విద్యారంగ సంబంధిత వినియోగంలోని వారు కావడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశంలో విద్యా రంగంలోని పెట్టుబడులు అవకాశాలపై ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) తాజా నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. విద్యకు ప్రాముఖ్యత గతంలో కన్నా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం వారు ఎక్కువగానే వెచ్చిస్తున్నారు. ఇటీవలి గణాంకాల ప్రకారం 0-14 మధ్య వయసుగల చదువుకొనే పిల్లలు దేశ జనాభాలో 29 శాతం ఉన్నారు. అందువల్లే విద్యారంగం మంచి అవకాశాలకు నిలయంగా మారుతోందని ఆ నివేదిక వివరించింది. ఈ దృష్ట్యా దేశంలో విద్యా రంగం పెట్టుబడులు 2020-21లో రూ.13.32 లక్షల కోట్లకు (180 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) చేరుకుంటాయని అంచనా. ఉన్నత విద్య విభాగంలో 2025 నాటికి రూ.2,44,824 కోట్లకు (35.03 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) పెరుగుతుందని లెక్కగడుతున్నారు. 

విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన ప్రభుత్వం 
డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం విద్యా రంగంలో 2002 నుంచి విదేశీ పెట్టుబడులు 2020 మార్చి వరకు 3.24 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
ఒక్క 2020లోనే 1.1 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2022 నాటికి ఈ రంగంలో పెట్టుబడులు 3.50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.
2020 జనవరి నుంచి ఆగస్టు వరకు వ్యవస్థీకృత మూలధన పెట్టుబడిదారులు (వెంచర్‌ కేపిటల్‌ ఇన్వెస్టర్లు) 36 ఒప్పందాలతో 1.19 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నారు. గత ఏడాది ఇదే కాలానికి 43 ఒప్పందాలతో 409 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు సమకూరాయి.

నూతన విద్యా విధానంతో పెట్టుబడుల పరుగులు 
నేషనల్‌ అక్రిడిటేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ బిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఫారెన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో నేరుగా 100 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ
జాతీయ నూతన విద్యా విధానం-2020 ద్వారా అనేక సంస్కరణలకు తెరతీసింది. సుస్థిర అభివృద్ధికి వీలుగా 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాల ప్రణాళికతో దీన్ని రూపొందించారు. 
2020-21 కేంద్ర బడ్జెట్‌లో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు ప్రభుత్వం రూ.59,845 కోట్లు (8.56 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) కేటాయించింది. 2022 నాటికి ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ (ఆర్‌ఐఎస్‌ఈ)ను పునరుద్ధరించడం కోసం తాజా బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు (429.55 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు) వ్యయం చేయనున్నారు.
నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బందికి వీలుగా వైద్య విద్యా రంగాన్ని పటిష్టం చేస్తోంది. 

దేశంలో అవకాశాలు ఇలా..
దేశంలో స్కూళ్లకు వెళ్లే పిల్లలు 250 మిలియన్లకు పైగా ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచంలోని ఉన్నత విద్యా సంస్థల అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఇండియా ఒకటి. 2019-20లో దేశంలో  39,931 కళాశాలలు, 993 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
2018-19 గణాంకాల ప్రకారం దేశంలో సెకండరీ, హయ్యర్‌ సెకండరీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 37.4 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు.  
జనాభాలో రెండవ స్థానం, 5-24 మధ్య వయస్కుల సంఖ్య 500 మిలియన్ల (50 కోట్లు)కు పైగా ఉండడం వల్ల విద్యా రంగంలో అపార అవకాశాలు వస్తున్నాయి. 
ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ ఇండెక్స్‌-2019 గణాంకాల ప్రకారం ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉన్న 100 దేశాల్లో ఇండియాది 34వ స్థానం కావడం. 
ఇంటర్నెట్‌ వ్యాప్తి పెరగడం (గత ఏడాది చివరకు 54.29 శాతానికి చేరుకుంది).
కోవిడ్‌ నేపథ్యంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా విభాగాలలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, బ్లెండెడ్‌ (మిశ్రమ) విధానంలో ఆయా సంస్థలు విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మరిన్ని వార్తలు