విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్‌

26 Jun, 2022 12:40 IST|Sakshi

వచ్చే ఏడాది నవంబర్‌ 6 నుంచి 13 వరకూ నిర్వహణ

సదస్సులో భాగంగానే ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 75వ సమావేశం

పాల్గొననున్న 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌) 25వ కాంగ్రెస్‌ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్‌ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు.

అత్యాధునిక నీటి పారుదల విధానాలను ఈ సమావేశాల్లో ప్రదర్శిస్తారు. వాటిని అందిపుచ్చుకుని.. నీటి వనరులను మరింత సమర్థంగా  ఉపయోగించుకుని.. అత్యధిక విస్తీర్ణంలో ఆయకట్టుకు నీరందించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్‌ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు.

1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు. ఆ సంస్థ 23వ కాంగ్రెస్‌ను మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీలో 2017, అక్టోబర్‌ 8 నుంచి 14 వరకూ నిర్వహించారు. ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌ను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియా దక్కించుకోగా, 25వ కాంగ్రెస్‌ నిర్వహణ బాధ్యతలను భారత్‌ చేజిక్కించుకుంది. ఆ సదస్సును విశాఖలో నిర్వహించాలని ఐసీఐడీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.యల్లారెడ్డి చేసిన ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదించారు.

రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేసే దిశగా..
ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌కు విశాఖపట్నాన్ని వేదికగా చేసుకోవడం నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఇస్తున్న ప్రాధాన్యతకు దక్కిన గౌరవంగా సాగు నీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో శతాబ్దాల కిందట నిర్మించిన చెరువులను సంరక్షించుకుని, ఆయకట్టుకు నీళ్లందించడం దగ్గర్నుంచి.. చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాలను అందిపుచ్చుకుని.. తక్కువ నీటితో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తుండటాన్ని ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ప్రతిపాదించే అత్యా«ధునిక నీటి పారుదల విధానాలను పరిశీలించి.. వాటిని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


     

మరిన్ని వార్తలు