పిట్టిగుంట.. ఉద్యోగులే ఇంటింటా!

29 May, 2022 10:58 IST|Sakshi

80 కుటుంబాలున్న పిట్టిగుంటలో 105 మంది ఉద్యోగులు

మద్యానికి దూరం...శ్రమే ఆయుధం

వెల్లివిరిసిన రాజకీయ చైతన్యం

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు...అనేందుకు శ్రీ అవధూత కాశినాయన మండలం  లోని పిట్టిగుంట గ్రామం నిదర్శనం.  ఒకరిని చూసి మరొకరు ఉన్నతంగా ఉండేందుకు పోటీ పడ్డారు. గ్రామాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మార్చేశారు.   

సాక్షి ప్రతినిధి, కడప : శ్రీ అవధూత కాశినాయన మండలం రంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టిగుంట గ్రామం ఉన్నత చదువులు, ఉద్యోగాలకు నిలయంగా మారింది. ఆది నుంచి చైతన్యవంతమైన గ్రామంగా పేరు గడించింది. 80 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ఇంటికో ఉద్యోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. ఉపాధ్యాయులు మొదలుకొని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సైంటిస్టులు, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఇక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు పుట్టినిల్లు. మహిళలు సైతం ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 

విద్య, ఉద్యోగం, అభివృద్ధిపైనే చర్చ
1960లోనే ఈ గ్రామం నుంచి బుసిరెడ్డి జానకిరామిరెడ్డి తొలి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత 15 మంది ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఒకవైపు గురువులుగా విద్యాబోధన చేస్తూనే మరోవైపు వ్యవసాయానికి వారు అ«ధిక ప్రాధాన్యత ఇచ్చారు. పల్లెలోనే ఉంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. గ్రామంలో గురువులు ఎక్కువగా ఉండడంతో వాతావరణమే మారిపోయింది. గ్రామం రచ్చబండ వద్ద ఇతరత్రా పనికిరాని చర్చలు కాకుండా విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిపైనే చర్చలు నడిచేవి.

అక్కడి ఉపాధ్యాయులు విద్యకు గల ప్రాధాన్యతను నిత్యం తెలియజెప్పేవారు. దీంతో అందరూ తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి చెన్నైలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. దశరథరామిరెడ్డి చిత్తూరుజిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి రైల్వేశాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా సేవలు అందిస్తున్నారు.  పీహెచ్‌డీలు, ఎంబీఏ, ఏజీబీఎస్సీలు చేసిన వారు చాలామంది వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు రైల్వే, ఆర్మీ, పోలీసు ఉద్యోగాల్లోనూ ఉన్నారు.   

∙ప్రస్తుతం పిట్టిగుంటలో 21 మంది ప్రభుత్వ ఉపా« ద్యాయులు, 10 మంది రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, మరో 31 మంది వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆరుగురు ప్రైవేటు విభాగంలో ఉన్న త ఉద్యోగాలు చేస్తున్నారు. 37 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజిర్లుగా పనిచేస్తున్నారు. 80 కుటుంబాలు ఉన్న పిట్టిగుంటలో ప్రస్తుతం మొత్తం 105 మంది ఉద్యోగులు ఉండడం గమనార్హం. క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిట్టిగుంట ఉద్యోగులకు నిలయంగా మారింది.

వ్యసనాలకు దూరం 
వ్యసనాలను దరిచేరనివ్వని గ్రామంగా పిట్టిగుంటకు పేరుంది. ప్రధానంగా ఇక్కడి వారు మద్యానికి దాదాపు దూరంగా ఉంటారు. దీని ప్రభావాన్ని ఆ గ్రామం మీద పడనీయలేదు. ఇతర వ్యసనాలకు సైతం గ్రామస్తులు దూరంగా ఉంటారు. 

ఇంటికి ముగ్గురు ఉద్యోగులు..
పిట్టిగుంట గ్రామంలో ఇంటికి ఇద్దరు, ముగ్గురు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. 1960లో గ్రామంలో తొలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకిరామిరెడ్డి ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులే. ఒక కుమారుడు దశరామిరెడ్డి చిత్తూరు జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ)గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు జయరామిరెడ్డి హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. మరో కుమారుడు భాస్కర్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ∙రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పెద్ద పుల్లారెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి చెన్నైలో బాబా ఆటమిక్‌ రీసెర్చి సెంటర్‌లో సైంటిస్టుగా ఉన్నారు. మరో కుమారుడు రఘురామిరెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 
∙రైతు సుబ్బరామిరెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఒక కుమారుడు శివశంకర్‌రెడ్డి ఎంఏ ఎంఈడీ పూర్తి చేసి లెక్చరర్‌గా పనిచేస్తుండగా, మరో కుమారుడు రాజశేఖర్‌రెడ్డి రైల్వేశాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఇలా పలు కుటుంబాల్లో ఇద్దరు నుండి ముగ్గురు వరకు ఉద్యోగులుగా ఉండడం గమనార్హం. 

వ్యవసాయమే ప్రాణం
ప్రతి ఇంటా ఉద్యోగులు ఉన్నా గ్రామస్తులు వ్యవసాయాన్ని పక్కన పెట్టలేదు. ఉద్యోగిగా విధి నిర్వహణ పూర్తి కాగానే ఖాళీ సమయాల్లో పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఉల్లి, పత్తి, మిరప, కూరగాయలు ఇతర పంటలను ఇక్కడి రైతులు విరివిగా పండిస్తారు. 

ఊరు వాతావరణమే ఉన్నత స్థాయికి దోహదపడింది 
మా గ్రామ వాతావరణమే మేము ఉన్నత స్థాయికి చేరేందుకు దోహాదపడింది. మాకు చిన్న నాటి నుంచే చదువు ప్రాముఖ్యత తెలిసి వచ్చింది. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివారు. ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు.
– దశరథరామిరెడ్డి , (చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి), పిట్టిగుంట 

విద్యతోనే ఉన్నత స్థాయికి 
విద్యతోనే మనిషి ఉన్నత స్థాయికి చేరుకోగలడు. నేను కష్టపడి చదివాను.  2012 నుంచి చెన్నైలోని బాబా ఆటోమిక్‌ రీసెర్చి సెంటర్‌లో సైంటిస్టుగా పనిచేస్తున్నాను. 
   – శ్రీనివాసులరెడ్డి , పిట్టిగుంట గ్రామం 

కష్టపడేతత్వం కలిగి ఉండాలి
కష్టపడేతత్వం ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు. మా గ్రామంలో చాలామంది ఉన్నత చదువులు చదివారు.  నేను ఎంటెక్‌ పూర్తి చేశాను. ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను.
– బి.వెంకట రమణారెడ్డి (ప్రిన్సిపాల్‌), పిట్టిగుంట 

ఆది నుంచి మా గ్రామస్తులది కష్టపడే మనస్తత్వం. చదువు ప్రాధాన్యత తెలుసు. అందుకే పెద్దలు మమ్మల్ని చదివించి ఉపాధ్యాయులను చేశారు. మా తర్వాత కూడా చాలా మంది ఉపాధ్యాయులయ్యారు. మా ఊరిని చూస్తే గర్వంగా ఉంది. 
– బి.పుల్లారెడ్డి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, పిట్టిగుంట 

మరిన్ని వార్తలు