ఆ..'నందిని' జీవన రాగం 

1 Nov, 2020 08:20 IST|Sakshi

కుంకుమ పూల సౌరభాలు.. మంచు కొండల సోయగాలు.. పచ్చని ప్రకృతి ఆమె చిన్ననాటి నేస్తాలు. సమస్త జంతుజాలం చెట్టు చేమలతో నిండిన అందమైన అడవి ఆమెకు ఎంతో ఇష్టం. కొమ్మల మాటున దాగిన పక్షుల కువకువలు తననే పలకరిస్తున్నట్లు .. చెంగుచెంగున దూకే లేత పసికూనల్లాంటి లేడిపిల్లలు తన వెంటే వస్తున్నట్లు.. వనమంతా తామై స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు తమను సంరక్షించమన్నట్లు వెంటాడిన ఆ భావన హిమసీమల్లో వికసించిన ఆ విద్యాసుమాన్ని అటవీశాఖవైపు నడిపించాయి. అలా తన మనసుకు నచ్చిన వన్యప్రాణి సంరక్షణనే వృత్తిగా మలచుకున్న కాశ్మీరీ కుసుమం నందినీ సలారియా ఇందిరాగాంధీ జూ పార్కు క్యూరేటర్‌గా బదిలీపై వచ్చారు. భూతలస్వర్గంగా పిలిచే జమ్ముకశ్మీర్‌ నుంచి పర్యాటకుల స్వర్గధామమైన విశాఖ వరకు ఆమె జీవనప్రయాణం ..  ఈ వారం 

ఆర్మీ స్కూల్లో విద్యాభ్యాసం 
మాది జమ్ములోని కథువా. అమ్మ, నాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. నా బాల్యమంతా జమ్ములోనే. జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత హర్యానాలోని జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కాలేజీలో వెటర్నరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. తర్వాత వెటర్నరీ సైన్స్‌లో పీహెచ్‌డీలో చేరాను. ఒక సంవత్సరం తర్వాత 2013లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక కావడంతో పీహెచ్‌డీ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది.

అలా ఐఎఫ్‌ఎస్‌కు ..  
నాకు ముందు నుంచి వన్యప్రాణులపై ఆసక్తి ఉండేది. డిగ్రీ సమయంలో ఐఎఫ్‌ఎస్‌ గురించి తెలిసింది. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 24వ ర్యాంక్‌ రావడంతో నాకిష్టమైన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎంచుకున్నాను. డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో ఐఎఫ్‌ఎస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. రెండేళ్ల శిక్షణ అనంతరం మరో పది నెలలు వైల్డ్‌లైఫ్‌లో డిప్లమో చేశాను. 

అమ్మ, నాన్నలే ఇన్‌స్పిరేషన్‌  
అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగులు కావడంతో వాళ్లలా ఉన్నత ఉ ద్యోగం చేయాలి అనే తపన ఉండేది. ఆ క్రమంలోనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. మొ దటి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యాను.  

అడవులన్నీ చుట్టేశా 
ట్రైనింగ్‌ సమయంలో దాదాపు అడవులన్నీ చూశాను. రెండేళ్ల శిక్షణలో ఒక నెల రోజులు తరగతులు ఉంటే మరో 20, 25 రోజులు ఫీల్డ్‌ ట్రిప్‌ ఉండేది. అలా దాదాపు ఉత్తర భారతదేశంలోని అడవులన్నీ తిరిగాం. ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్‌ అందేది కాదు. ఆ పరిస్థితులన్నీ తట్టుకోగల ఫిట్‌నెస్‌ చాలా అవసరం. మా శిక్షణలో అదీ భాగమే.  

కాకినాడలో ఫస్ట్‌ పోస్టింగ్‌ 
2016లో నా మొదటి పోస్టింగ్‌ కాకినాడలో. డీఎఫ్‌వోగా చేరాను. 2020 జూన్‌ వరకు అక్కడే. తర్వాత బదిలీపై విశాఖ జూ పార్కు క్యూరేటర్‌గా వచ్చాను.  

ప్రశాంత వాతావరణంలోనే.. 
జమ్ము, కశ్మీర్‌ అంటే సెన్సిటివ్‌ ప్రాంతమే. కానీ మేము ఉన్న కథువా ప్రశాంత ప్రదేశం. ఎలాంటి అలజడులు లేవు. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. 

సందేశాత్మక చిత్రాలు ఇష్టం 
నాకు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు, సందేశాత్మక చిత్రాలు ఇష్టం. కాలేజ్‌ డేస్‌లో ఇంగ్లిష్, హిందీ మూవీస్‌ బాగానే చూశాను. ఇపుడు చూడటం తగ్గించేశాను. ప్రస్తుతం సినిమాల్లో డ్రెస్సింగ్‌ బాగా లేదు. ఇప్పుడిప్పుడే మంచి స్టోరీ ఉన్న తెలుగు మూవీస్‌ చూస్తున్నాం. గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్‌ నచ్చాయి. 

అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉండాలి 
అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉండాలి. అభద్రతా  భావం పోవాలి. చట్రంలోంచి బయటపడాలి. వాళ్లు ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి వెళ్లడానికి కృషి చేయాలి.  

వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాలి 
నాకు వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం. వాటికి సంబంధించిన పుస్తకాలే అధ్యయనం చేస్తున్నాను. విశాలమైన అరణ్యంలో స్వేచ్ఛగా తిరిగే జంతువులను, పక్షులను జూలో ఎన్‌క్లోజర్లకే పరిమితం చేస్తున్నాం. అలాంటి వాటిపై ప్రేమ, మానవత్వం చూపించాలి. ఎందరో దాతలు అన్నదానాలకు లక్షల రూపాయల్లో విరాళాలిస్తారు కదా, మరి నోరు తెరిచి చెప్పలేని మూగజీవులను ఎందుకు పట్టించుకోరు అనిపిస్తుంది. జంతుప్రేమికులు జూలో వన్య ప్రాణులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి.   

ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని.. 
విశాఖ జూపార్కును ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని నా ఆలోచన. ఇక్కడి అవకాశాలు, వాతావరణంపై సీజెడ్‌ఏఐకి నివేదిక ఇచ్చాను. ఇక్కడ లేని జంతువులు, పక్షులను ఇతర దేశాల జూపార్కుల నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సందర్శకులు ఆకట్టుకునేలా దీనిని తీర్చిదిద్దాలి. అందుకు ప్రయత్నిస్తున్నా.     

తెలుగు బాగా నేర్చుకున్నా.. 
రెండేళ్ల ఐఎఫ్‌ఎస్‌ శిక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కొద్ది నెలలు శిక్షణ పొందాను. మొదటి పోస్టింగ్‌ కూడా కాకినాడలో వచ్చింది. ఇక్కడ ప్రాంతీయ భాష తెలుగు కావడంతో నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది. తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించాను. అలా ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నాను. మా మాతృభాష డోగ్రీతో పాటు ఇంగ్లిష్, హిందీలో ఫ్లూయెన్సీ ఉంది.  

పెద్దల అనుమతితో ప్రేమ వివాహం 
ఐఎఫ్‌ఎస్‌ శిక్షణ కాలంలో నా బ్యాచ్‌మేట్‌ అనంత్‌ శంకర్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆయనది జార్ఖండ్‌. ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017లో మా వివాహం జరిగింది. ఆయన ఇప్పుడు విశాఖ డీఎఫ్‌వోగా చేస్తున్నారు. నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఎప్పుడూ మన ప్రయాణం ఆగకూడదు..  మనం ఏం చేసినా గుర్తింపు ఉండాలి. ఉన్నత స్థాయికి చేరాలి అంటే  ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెబుతారు.  

మరిన్ని వార్తలు