అక్రమాలకు ‘ప్లానింగ్‌’

18 Apr, 2022 23:13 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు 

నగరంలో దాదాపు 200 నిర్మాణాల వరకు గుర్తింపు

చార్జిషీట్‌ అంటూ టౌన్‌ప్లానింగ్‌

అధికారుల హడావుడి పదుల సంఖ్యలో కూడా జరిమానాలు విధించని వైనం

సాక్షి,అనంతపురం:  నగరంలో ఇలాంటి అక్రమ భవనాలు దాదాపు 200 వరకు ఉండగా  భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చార్జిషీట్‌ ఫైల్‌ చేస్తున్నారు. కోర్టుల ద్వారా నగరపాలకసంస్థకు జరిమానాలు విధించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అక్రమ భవనాల లెక్క తేల్చిన అధికారులు వాటిపై జరిమానా విధించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అస్మదీయులను ఒకలా... తస్మదీయులను మరోలా చూస్తున్నారు. నెలల క్రితమే అక్రమ భవనాల లెక్క తేలినా ఇప్పటి వరకూ కేవలం 30 భవనాల వరకే జరిమానాలు విధించారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లే­దు. కేవలం బిల్డర్లలో భయం పుట్టించడానికే హ­æడావుడి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా­యి.  

అంతా గుట్టుగానే... 
నగరపాలకసంస్థలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం కార్యకలాపాలు మొత్తం గుట్టుగానే సాగుతున్నాయి. దాదాపు ఏడాది కాలంలో ఈ విభాగంపై ఒక్క సమీక్ష కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కీలకమైన విభాగాన్ని గాలికి వదిలేస్తుండడంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.  ఇటీవల కాలంలో అక్రమ భవనాల నిర్మాణాలపై దాడులు కూడా తగ్గిపోయాయి. కొంతమంది అధికారులు లైసెన్స్‌ సర్వేయర్లతో కుమ్మక్కై అక్రమ భవనాల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కమలానగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌ నిర్మించడంతో పాటు అదనపు ఫ్లోర్‌ నిర్మాణం కూడా మొదలు పెడుతున్నట్లు తెలిసింది. సెట్‌ బ్యాక్‌ వదలాలనే  నిబంధనను విస్మరించారు. టౌన్‌ప్లానింగ్‌లో కొత్తగా వచ్చిన కిందిస్థాయి అధికారి అండదండలతో ఈ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకు భారీగానే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం 
కమలానగర్‌లో నిర్మిస్తున్న ఈ భవనంపై గతంలోనే దాడులు జరిపాం. అక్రమంగా నిరిస్తున్న ఫ్లోర్‌ను తొలగించాం. అయినప్పటికీ స్విమింగ్‌ పూల్‌ నిర్మించినట్లు మా దృష్టికి వచ్చింది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదు.  
–  శాస్త్రి, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్, నగరపాలకసంస్థ 

మరిన్ని వార్తలు