చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు

23 May, 2022 10:08 IST|Sakshi

సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ  దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఘన చరిత్ర.. 
శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.

కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. 

చారిత్రక ఆనవాళ్లు.. 
రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్‌ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి.

ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్‌ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  

చర్యలు తీసుకుంటాం.. 
ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.  
– సనపల కిరణ్‌కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి  

(చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి)

మరిన్ని వార్తలు