‘రియల్‌’ మోసాలకిక కళ్లెం

20 Feb, 2022 03:41 IST|Sakshi

గ్రామాల్లో అక్రమ లే అవుట్లలోనే 2.54 లక్షల ప్లాట్లు

రాష్ట్ర వ్యాప్తంగా 10,169 అక్రమ లే అవుట్లు ఉంటే అందులో 4,176కే రోడ్డు వసతి

814 లేఅవుట్లకు మాత్రమే కరెంటు లైను.. 362 లేఅవుట్లకే మంచి నీటి వసతి

కనీస సౌకర్యాలు లేని చోట ఇంటి స్థలం కొని సామాన్యులు మోసపోకూడదు

అందుకే అక్కడ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ఆంక్షలు

టీడీపీ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ లే అవుట్లు 

నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే ఈ దందా  

2015 నాటికే రాష్ట్రంలో 6,049 అక్రమ లే అవుట్లు

2019 నాటికి ఆ సంఖ్య 9,422కు పెరుగుదల

అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో లే అవుట్లు

మూడింట రెండొంతులు అనుమతులు లేనివే 

పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వాస్తవాలు

సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. 

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్‌ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్‌ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది.

90 శాతం వాటిలో కరెంటు లైను కరువు 
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి.

అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. 

నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే..
నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు