అవినీతి గుట్టు రట్టు

12 Sep, 2020 06:34 IST|Sakshi
ఆత్రేయపురం సొసైటీ

‘వద్దిపర్రు’ సొసైటీలో అక్రమంగా రూ.కోటిన్నర రుణాలు

డీసీసీబీ ఆత్రేయపురం బీఎం, లీగల్‌ ఆఫీసర్‌పై వేటు

రిటైర్డ్‌ డీజీఎం, సూపర్‌వైజర్ల బెనిఫిట్లకు బ్రేక్‌

‘సాక్షి’ కథనంతో విచారణ.. నిగ్గు తేలిన నిజాలు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్రమార్కులపై వేటు పడింది. సెంటు భూమి లేకపోయినా కమీషన్లకు కక్కుర్తి పడి, నకిలీ డాక్యుమెంట్లతో భూములు సృష్టించి, ఎడాపెడా రుణాల పేరుతో దోచేసిన వారిని ఎట్టకేలకు ఇంటికి సాగనంపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) ఆత్రేయపురం బ్రాంచి వద్దిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో అక్రమ రుణాల బాగోతంపై విచారణ పూర్తయింది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా నిగ్గు తేల్చిన డీసీసీబీ, సహకార ఉద్యోగు లు నలుగురిపై డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ శుక్రవారం వేటు వేశారు. ఉద్యోగంలో ఉన్న వారిని సస్పెండ్‌ చేయాలని, రిటైరైన సూపర్‌వైజర్, డీజీఎంల బెనిఫిట్లు నిలుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రూ.కోటిన్నర రుణాలు అక్రమ మార్గంలో విడుదల చేసినట్టు నిర్ధారణయింది. ఇందులో 
బాధ్యుల నుంచి 90 శాతం రికవరీ చేయడం డీసీసీబీకి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం)

‘అవినీతిలో సహకారం.. రూ.కోటిన్నర మాయం’ శీర్షికన ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనంపై డీసీసీబీ చైర్మన్‌ స్పందించి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వద్దిపర్రు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత తెలుగుదేశం ఏలుబడిలో నేతలు, సహకార అధికారులు కుమ్మక్కై బినామీ రైతుల పేర్లతో రూ.కోటిన్నర నొక్కేసిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన  చైర్మన్‌ ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని డీసీసీబీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.. ఆగమేఘాల మీద డీసీసీబీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. వెంకటేశ్వరరావు విచారణ ముగించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్‌ క్రాంతికృష్ణ, వద్దిపర్రు సొసైటీ రిటైర్‌ సూపర్‌వైజర్‌ ఎం.మహాలక్ష్మిరాజు, రిటైర్డ్‌ డీజీఎం పి.పట్టాభి రామయ్య, మేనేజర్‌/లీగల్‌ ఆఫీసర్‌ పి.సత్తయ్యలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. సీఈఓ మునేశ్వరరావును ఇదివరకే విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. (చదవండి: ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..)

నిగ్గు తేల్చిన అక్రమాలివే...
వద్దిపర్రు సొసైటీ సభ్యుడు కొండ్రు నాంచారావు పేరున భూమి లేకపోయినా నకిలీ డాక్యుమెంట్లతో రూ.17.21 లక్షలు స్వాహా.  
మరో సభ్యుడు వాకలపూడి హరిబాబు ఎకరం భూమికి రూ.2.50 లక్షలకు అర్హత ఉండగా..రూ.5 లక్షలు. ఎల్‌టీ రుణంగా ఎకరం భూమి ఉంటే రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..రూ.6.28 లక్షలు ఇచ్చారు. టైటిల్‌ డీడ్‌ లేకుండానే ఇతని సోదరుడు విశ్వేశ్వరరావుకు రుణం మంజూరు.
మూడెకరాలున్న మల్లాది వెంకటరామారావుకు రూ.7.65 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉండగా.. రూ.14.65 లక్షలు ఇచ్చారు.  
కరుటూరి శ్రీనివాసరావుకు ఒక రుణంగా రూ.20 లక్షల వరకు ఇవ్వవచ్చు..కానీ అడ్డగోలుగా రూ.33 లక్షల రుణం మంజూరు చేశారు.  
భూమి తక్కువగా ఉన్నా..అర్హతకు మించి ఆచంట మంగాదేవి, ఆచంట పద్మావతి, కరుటూరి వెంకటలక్షి్మలకు బాండ్లు లేకపోయినా క్రెడిట్‌ లిమిట్‌ లేకుండా రుణాలివ్వడం.
క్రెడిట్‌ లిమిట్‌ మంజూరు లేకుండా 40 మందికి ఏకంగా రూ.62.79 లక్షలు రుణాలు మంజూరు చేశారు. ఈ మంజూరులన్నీ బ్రాంచ్‌ మేనేజర్‌ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని విచారణలో నిగ్గుతేల్చారు.  
రిటైరైన సూపర్‌వైజర్‌ ఎం.మహాలక్ష్మిరాజు బ్రాంచ్‌ మేనేజర్‌కు తెలియకుండా డీ నమూనా పట్టాలపై 21 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. 
నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ మునేశ్వరావుతోపాటు మహాలక్ష్మిరాజు వాయిదా మీరిన రుణాలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 
ఎల్‌ఈసీ కార్డులు రెన్యూవల్‌ చేయకుండా రుణాలు రెన్యూవల్‌ చేయడంలో సీఈఓతోపాటు సూపర్‌ వైజర్‌ బాధ్యులు. 
సంఘంలో క్రెడిట్‌ లిమిట్‌ మంజూరు ఉందా? లేదా? అని పరిశీలించకుండా 40 మంది సభ్యులకు రూ.62.79 లక్షలు లోన్లు మంజూరు చేశారు.  
31.03.2019 నాటికి రూ.31.68.150 మొండిబకాయిలుండగా.. ఇందులో మూడేళ్లు దాటిన రూ.24 లక్షలు ఉండగా..వాటి వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.  
భూములను పరిశీలించకుండా..డాక్యుమెంట్లు లేనప్పటికీ కొండ్రు నాంచారావుకు రుణం మంజూరు చేయడం. ఫేక్‌ డాక్యుమెంట్లను గుర్తించకుండా రుణాలు ఇచ్చిన సూపర్‌వైజర్, మేనేజర్, ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసిన ప్పటి డీజీఎం పి.పట్టాభి రామయ్య బాధ్యునిగా తేల్చారు.
వాకలపూడి హరిబాబు, సోదరుడు విశ్వేశ్వరావు, రాంబాబులకు రాజవరం సిండికేట్‌ బ్యాంకులో రుణాలున్నాయి. వీరికి డీసీసీబీ వెబ్‌ల్యాండ్‌ చూడకుండా అదనంగా రుణాలు మంజూరు చేయడం, వెబ్‌ ల్యాండ్‌ చూసి ఉంటే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బ్రాంచ్‌ మేనేజర్, సూపర్‌వైజర్‌ నిర్లక్ష్యం వల్ల బ్యాంక్‌ నష్టపోయింది. లీగర్‌ ఆఫీసర్‌ సత్తయ్య ఒక రుణం అవుట్‌ స్టాండింగ్‌ ఉండగా...మరో రుణానికి సిఫార్సు చేస్తూ వద్దిపర్రు సొసైటీ చేసిన తప్పును గుర్తించలేకపోవడం బాధ్యతారాహిత్యంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. 

‘బాధ్యతగా లేకుంటే ఇంటికే’ 
సొసైటీ, బ్రాంచి, చివరకు డీసీసీబీలో సైతం అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా లేకుంటే ఇంటికి పంపించేస్తా. రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఏ దశలో అయినా నిర్లక్ష్యం, అవినీతి, కమీషన్లకు కక్కుర్తి పడితే కఠిన చర్యలు తప్పవు. డీసీసీబీ సీఈఓ స్థాయి నుంచి డీజీఎంలు, ఏజీఎంలు, లీగల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్‌ వరకూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తించాలి. లేకుంటే ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి సిఫారసులతో వచ్చినా రైతులను మోసం చేసిన వారిని, బ్యాంకుకు నష్టం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదు.
– అనంతబాబు, చైర్మన్, డీసీసీబీ 

మరిన్ని వార్తలు