విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..

28 Sep, 2022 19:51 IST|Sakshi
జి.మాడుగుల మండలం కూటికొండలు ప్రాంతంలో రంగురాళ్ల క్వారీ

విలువైన క్యాట్‌ ఐ రకం రాళ్లు లభ్యం

డబ్బుపై ఆశతో ప్రాణాలకు తెగిస్తున్న గిరిజనులు

మూడు క్వారీల వద్ద వ్యాపారుల మకాం, భారీగా వ్యాపారం

సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే  క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి.  


విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు 

కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్‌లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. 

జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్‌ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు.


ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు.


రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం  

జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్‌ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి.  
– సతీష్‌కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా

మరిన్ని వార్తలు