ఆయిల్‌ కంపెనీల టెండర్ల కోసమే అక్రమ రిజిస్ట్రేషన్లు

10 Jan, 2022 02:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆయిల్‌ ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్లపై రవాణాశాఖ ప్రాథమిక నిర్ధారణ

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తున్న అధికారులు 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్‌ కంపెనీలను బురిడీ కొట్టించి టెండర్లు దక్కించుకునేందుకే రాష్ట్రంలో కొందరు సిండికేట్‌ సభ్యులు ట్యాంకర్ల ఫేక్‌ రిజిస్ట్రేషన్ల దందా సాగించినట్టు రవాణాశాఖ నిర్ధారించింది. ట్యాంకర్లు లేకపోయినా ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక మతలబు ఇదేనని ప్రాథమికంగా తేల్చింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం పోలీసుశాఖ సమాయత్తమవుతోంది. ఆయిల్‌ కార్పొరేషన్లు ఏటా ట్యాంకర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తాయి. టెండర్లలో పాల్గొనేందుకు నిర్ణీత సంఖ్యలో ట్యాంకర్లు ఉండాలనే నిబంధన విధిస్తాయి. దీంతో ఆయిల్‌ ట్యాంకర్లు లేనప్పటికీ ఉన్నట్టుగా చూపించి అర్హత సాధించేందుకు ఓ ముఠా ఈ ఎత్తుగడ వేసింది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు రవాణాశాఖ గుర్తించింది. ఇప్పటికే కృష్ణాజిల్లాలో కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ అధికారుల పూర్తి సహకారంతోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సాగించారు. నిబంధనల ప్రకారం మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వాహనాలను పరిశీలించి సంబంధిత పత్రాలను ఆమోదించాలి. అనంతరం ఆర్టీవో స్థాయి అధికారి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో ఏకంగా 110 ట్యాంకర్లు లేకుండానే ఎంవీఐ బి.గోపీనాయక్‌ ఉన్నట్టుగా పత్రాల్లో పేర్కొన్నారు.

గూడూరు వంటి చిన్న పట్టణంలో అంత భారీసంఖ్యలో ఆయిల్‌ ట్యాంకర్లు ఒకేసారి ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారో అని ఆర్టీవో సి.మల్లికార్జునరెడ్డి సందేహించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక కృష్ణాజిల్లాలో అయితే మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కాకుండా కేవలం విఠల్‌ అనే సీనియర్‌ అసిస్టెంటే అక్రమ రిజిస్ట్రేషన్ల తతంగాన్ని నడిపించడం విస్మయపరుస్తోంది. కృష్ణాజిల్లాలో 11 ట్యాంకర్లను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించినట్టు గుర్తించారు. రికార్డుల పరిశీలన కొనసాగుతుండటంతో మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రవాణాశాఖ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆయిల్‌ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. రవాణాశాఖ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు కోసం బృందాన్ని ఈశాన్య రాష్ట్రాలకు పంపించనున్నారు. కేవలం ఆయిల్‌ కంపెనీల టెండర్లు దక్కించుకునేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారా.. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు అధికారులు దృష్టిసారించనున్నారు.  

మరిన్ని వార్తలు