అత్తరు.. అవినీతి కంపు

18 Aug, 2021 08:13 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంధం చెక్కలు, నూనె(ఫైల్‌)

నిబంధనలకు పాతరేసిన సెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాల

గంధపు చెక్కల స్మగ్లర్లతో సంబంధాలు

కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి అక్రమ రవాణా 

మడకశిర:  ఇంటి పేరు కస్తూరి... ఇంటిలో గబ్బిలాల కంపు అన్న చందంగా మారింది సెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాల తీరు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ గంధపు చెక్కల స్మగ్లర్లతో సంబంధాలు నెరపుతూ, అక్రమ వ్యాపారానికి తెర తీశారు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న ఈ తంతు ఇటీవల పోలీసుల తనిఖీలతో వెలుగు చూసింది.

అక్కడ కాదంటే ఇక్కడికొచ్చి...  
సెంట్‌ తయారీలో కీలకమైన గంధపు నూనె ఉత్పత్తి ఫ్యాక్టరీల నిర్వహణకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనుమతి లేదు. కొన్ని నిబంధనలతో ఫ్యాక్టరీలను నిర్వహించుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేరళ వాసులు కొందరు మడకశిర నియోజకవర్గం అమరాపురంలో 30 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడింది. రొళ్ల, అగళి మండలం హుళ్లేకెర, అమరాపురం మండలం బసవనపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.

నిబంధనలు గాలికి.. 
ప్రభుత్వ నిబంధనలను సెంట్‌ ఫ్యాక్టరీ నిర్వాహకులు తుంగలో తొక్కారు. అటవీ శాఖ అనుమతితో కొనుగోలు చేయాల్సిన గంధపు చెక్కలను నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని స్మగ్లర్ల ద్వారా అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని నూనె ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరాపురం మండలం బసవనపల్లి సెంట్‌ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ.1.25 కోట్లు విలువైన 35 క్వింటాళ్ల గంధపు చెక్కలు, 16 లీటర్ల గంధం నూనెను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు.

ఈ విషయంగా ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రెన్యూవల్‌ చేసుకోకుండానే ఫ్యాక్టరీని నడిపిన రోజులూ ఉన్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. గంధపు చెక్కలను ఉడకబెట్టే సమయంలో వివిధ రకాల పొట్టు తప్ప కలపను వాడరాదనే నిబంధన  ఉంది. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు యథేచ్ఛగా కట్టెలను వాడి పర్యావరణానికి హాని కలిగించినట్లు గుర్తించారు. నిబంధనలకు పాతరేస్తూ ఉత్పత్తి చేసిన గంధం నూనెను అరబ్‌ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేసి రూ.కోట్లలో నిర్వాహకులు గడించినట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీల పర్యవేక్షణను అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి.

కట్టుదిట్టమైన నిఘా
మడకశిర నియోజకవర్గంలోని సెంట్‌ ఫ్యాక్టరీలపై ఇకపై గట్టి నిఘా పెడతాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి గంధపు చెక్కలు అక్రమంగా ప్యాక్టరీలకు చేరకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించకపోతే ప్యాక్టరీల లైసెన్సులను రద్దు చేస్తాం.

మరిన్ని వార్తలు