రూటు మార్చిన అక్రమార్కులు

27 Sep, 2020 10:20 IST|Sakshi

ఇతరుల ఆధార్‌ కార్డులతో బుకింగ్‌ 

ఒకే సెంటర్‌కు ఇసుక వచ్చేలా ప్రణాళిక 

డంప్‌ చేసి అధిక ధరతో అమ్మకాలు 

వర్షాకాలంలోనూ పెరిగిన డిమాండ్‌

వివరాలు ఆరా తీస్తున్న అధికారులు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సెబ్, సివిల్‌ పోలీసుల దాడులతో ఇసుక మాఫియా రూటు మారింది. ఇన్నాళ్లూ అధికారుల కళ్లుగప్పి అర్ధరాత్రి ఇసుకను తరలించిన వారు.. ఇప్పుడు దర్జాగా అధికారికంగానే తెప్పిస్తున్నారు. ఇతరుల ఆధార్‌ కార్డులు వినియోగించి ఇసుక బుక్‌ చేసి.. దాన్నంతా ఒకేచోట డంప్‌ చేసి ఆ తర్వాత అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంతో ఇసుకాసురులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. గతంలో రీచ్‌ నుంచి డిపోలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుని విక్రయించేవారు. అయితే దీనిపై సెబ్‌ నిఘా ఉంచి సదరు కాంట్రాక్టర్లపై ఏకంగా కేసులు పెట్టడంతో ఇసుక అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇసుక అక్రమ రవాణాపైనే ఆధారపడి బతుకున్న వారు మరో కొత్తదారిలో అక్రమాలకు తెరలేపారు. ఇతరుల ఆధార్‌కార్డులతో ఇసుకను ఒకే ప్రాంతానికి బుక్‌ చేసుకుని.... అక్కడే డంప్‌ చేసేస్తున్నారు. అక్కడి నుంచి దర్జాగా అధిక ధరకు విక్రయిస్తున్నారు.  

వానాకాలంలోనూ పెరిగిన డిమాండ్‌ 
మామూలుగా వర్షాకాలం నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీంతో ఇసుక డిమాండ్‌ బాగా తగ్గిపోతుంది. కానీ జిల్లాలో ఇసుక డిమాండ్‌ గతంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. వాస్తవానికి ఇసుక రీచ్‌ నుంచి డిపోకు.. అక్కడి నుంచి వినియోగదారుల చేరే వరకూ నిఘా ఉంచేందుకు వాహనాలకు ఇప్పటికే జీపీఎస్‌ పరికరాలను అమర్చారు. ఈ నేపథ్యంలోనే ఇసుకాసురులు కొత్త మార్గాన్ని వెతుక్కున్నారు. బుకింగ్‌ సమయంలోనే అక్రమాలు చేయడం ద్వారా ఆదాయార్జనకు తెరలేపారు. గతంలో రోజువారీగా వర్షాకాలంలో కేవలం 1,000 టన్నుల మేరకు ఇసుక డిమాండ్‌ ఉండేది. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా 4 వేల నుంచి 5 వేల వరకూ డిమాండ్‌ ఉంటోంది. దీంతో అధికారులు అప్రమత్తమై మొత్తం ఇసుక బుకింగ్స్‌పై కూపీలాగటం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.  

ఇంత డిమాండ్‌ ఉందా.! 
వాస్తవానికి జిల్లాలో రోజూ 4 వేల టన్నుల వరకూ ఇసుక బుకింగ్‌ జరుగుతోంది. కొన్ని రోజుల్లో ఇది కాస్తా 5వేల టన్నులకు చేరుకుంటోంది. అయితే, వాస్తవ వినియోగం ఇంత ఉందా! లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఈ  స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయా అనే అనుమానం అధికారులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి బుకింగ్‌ జరుగుతోంది? నిజంగా వారి కోసమే ఇసుకను బుకింగ్‌ చేసుకున్నారా....? వారి ఆధార్‌కార్డుతో ఇతరులు బుక్‌ చేసి... పక్కదారి పట్టిస్తున్నారా....? అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధానంగా అనంతపురం పట్టణంతో పాటు కదిరి, హిందుపురం, మడకశిర ప్రాంతాల్లో ఈ విధంగా ఇతరుల ఆధార్‌కార్డులతో బుకింగ్‌ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

ఆరా తీస్తున్నాం 
ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. మామూలుగా నిర్మాణాలన్నీ ఆగిపోతాయి. అయినప్పటికీ ఇసుకకు డిమాండ్‌ తగ్గలేదు. అందుకే పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. కొంతమంది ఇతరుల ఆధార్‌లతో ఇసుకను బుక్‌ చేసుకుని.. డంప్‌ చేసి విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆ మేరకు విచారణ చేస్తున్నాం.  
– నిశాంత్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌   

మరిన్ని వార్తలు