తుఫానుగా బలపడనున్న వాయుగుండం

23 Nov, 2020 14:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల‌ నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు.

మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు.

చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు!

మరిన్ని వార్తలు